తెలుగు ‘అసురన్’ అఫిషియల్ అనౌన్స్ మెంట్

0

తమిళంలో సూపర్ హిట్ అయిన ‘అసురన్’ చిత్రం వసూళ్ల విషయంలో రికార్డులు సృష్టిస్తుంది. ధనుష్ కెరీర్ లో ఇప్పటి వరకు సాధ్యం కాని వసూళ్లు ఈ చిత్రంతో నమోదు అవుతున్నాయి. మూడు వారాల్లో 150 కోట్లకు పైగా అసురన్ రాబట్టాడు. ధనుష్ ఈ చిత్రంతో ఆకట్టుకున్న తీరు అందరిని మెప్పిస్తుంది. అసురన్ చిత్రాన్ని తెలుగులో రామ్ చరణ్ రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. అవి నిజం కాదని వెంకటేష్ హీరోగా అసురన్ రీమేక్ కాబోతుందని వార్తలు వచ్చాయి.

అసురన్ సినిమా తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందా.. ఆ తమిళ సినిమాను రీమేక్ చేసే ధైర్యం తెలుగు హీరోలకు ఉందా వెంకీ చేయక పోవచ్చు ఎవరు కూడా రీమేక్ కు సిద్దం అవ్వక పోవచ్చు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. కాని నిన్న వార్తలు వచ్చాయి.. నేడు అసురన్ రీమేక్ కు సంబంధించి అఫిషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. తమిళంలో అసురన్ నిర్మించిన నిర్మాత కళైపులి ఎస్ థాను తెలుగు నిర్మాత సురేష్ బాబు మరియు వెంకటేష్ ను కలిశాడు.

సురేష్ ప్రొడక్షన్స్ ట్విట్టర్ హ్యాండిల్ లో అధికారికంగా అసురన్ చిత్రాన్ని వెంకటేష్ చేయబోతున్నట్లుగా ప్రకటించింది. ఈ రీమేక్ ను సురేష్ బాబు మరియు కళైపులి ఎస్ థాను గారు కలిసి నిర్మించబోతున్నట్లుగా కూడా ప్రకటన వచ్చింది. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా కథలో కొన్ని మార్పులు చేర్పులు చేసి సినిమాను తెరకెక్కించే అవకాశం ఉంది. మరి తెలుగు వర్షన్ కు దర్శకత్వం వహించేది ఎవరో చూడాలి.

తమిళంలో వెట్రిమారన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. తెలుగులో కూడా ఆయనే దర్శకత్వం వహిస్తే బాగుంటుందనే అభిప్రాయం కొందరు వ్యక్తం చేస్తున్నారు. వెంకీ మామ పూర్తి అయిన వెంటనే వెంకటేష్ ఈ చిత్రాన్ని మొదలు పెట్టే అవకాశం ఉంది. గతంలో వెంకీ పలు సినిమాలను రీమేక్ చేసి సూపర్ హిట్స్ దక్కించుకున్నాడు. అసురన్ తో కూడా మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంటాడో లేదో చూడాలి.