వారిని టెన్షన్ పెడుతున్న వెంకీమామ..!

0

టాలీవుడ్ లో రిలీజ్ డేట్ల విషయంలో ఎప్పుడూ ఏదో ఒక గొడవ ఉంటుంది. ఇప్పటికే సంక్రాంతి సినిమాల పోటీ రచ్చ చూస్తున్నాం. ఆ ఒక్క సీజనే కాదు.. డిసెంబర్ క్రిస్మస్ సీజన్ లో కూడా తీవ్రమైన పోటీ నెలకొంది. డిసెంబర్ 20 నుంచి 25 లోపు రిలీజ్ ప్లాన్ చేసుకున్న సినిమాలలో చాలా మార్పులు చేర్పులు జరిగి ఇప్పటికి కొంతమంది ఫిక్స్ అయ్యారు.. కొందరు జనవరి ఫిబ్రవరి నెలలకు వాయిదా వేసుకున్నారు. అయితే డిసెంబర్ లో రిలీజ్ ఫిక్స్ చేసుకున్న సినిమాల నిర్మాతలను ‘వెంకీమామ’ గడగడలాడిస్తోందనే టాక్ వినిపిస్తోంది.

విక్టరీ వెంకటేష్.. మేనల్లుడు నాగచైతన్య హీరోలుగా నటిస్తున్న మల్టిస్టారర్ చిత్రం ‘వెంకీమామ’. సీనియర్ నిర్మాత సురేష్ బాబు ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో నెలకొన్న తికమకతో డిసెంబర్ సినిమాల నిర్మాతలకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ‘వెంకీమామ’ రిలీజ్ డేట్ ఒకసారి డిసెంబర్ 20 అంటారు.. మరోసారి సోలో రిలీజ్ డేట్ కావాలి డిసెంబర్ 13 అంటారు.. ఇవన్నీ లీకులే.. అధికారిక సమాచారం కాదు. దీంతో ఆ డేట్లకు రిలీజ్ ప్లాన్ చేసుకున్నవారు ఆందోళనలో ఉన్నారు. ఇప్పటికే పోటీలో ఉన్నవారు కూడా పెద్ద నిర్మాతలే కానీ సురేష్ బాబు రంగంలోకి దిగితే వారి సినిమాలకు ఎక్కువ థియేటర్లు దొరకవు. సమస్యంతా థియేటర్లతోనే.

ఇదిలా ఉంటే ఈ సినిమాను కనుక వారం అటూ ఇటూ ముందుకు జరిపితే కార్తికేయ సినిమా ’90ML’ కు ఇబ్బంది తప్పదు. ఈ సినిమాను డిసెంబర్ మొదటివారం లేదా రెండో వారంలో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. అసలే హిట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న కార్తికేయ సోలో డేట్ పై ఎన్నో ఆశలు పెట్టుకుంటే.. ‘వెంకీమామ’ టీమ్ కార్తికేయను టెన్షన్ పెడుతున్నారు. ‘వెంకీమామ’ రిలీజ్ డేట్ పక్కాగా చెప్తే.. దాన్ని బట్టి మిగతా సినిమాల వారు ప్లానింగ్ లో మార్పుచేర్పులు చేసుకుంటారు. అలా కాకుండా డేట్ విషయంలో తికమకపడి ఇతరులను ఇబ్బందులకు గురి చేయడం సరికాదని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. మరి వెంకీమామగారి అన్నయ్య సురేష్ మామగారు ఈ విషయంలో ఏం చేస్తారో చూడాలి.
Please Read Disclaimer