స్టార్ క్రికెటర్ బయోపిక్ లో `సైరా` స్టార్

0

బయోపిక్‌ల ట్రెండ్ అంతకంతకు వేడెక్కిస్తోంది. రొటీన్ మాస్ మసాలా కమర్షియల్ చిత్రాలు చూసి మొహం మొత్తిన ప్రేక్షకులు గత కొంత కాలంగా రియలిస్టిక్ సినిమాలకు పట్టం కడుతున్న సంగతి విదితమే. ఈ ట్రెండ్ ని క్యాష్ చేసుకునేందుకు ఫిలింమేకర్స్ తెలివైన ఎత్తుగడలు వేస్తున్నారు. అప్పటికే మూలనపడిన పాపులర్ సెలబ్రిటీల జీవితకథల్ని వెలుగులోకి తీసుకొస్తున్నారు. పలువురు స్టార్లు బయోపిక్‌లపై ప్రత్యేక ఆసక్తిని చూపించడం మేకర్స్ కి కలిసొస్తోంది. ప్రేక్షకుల్లో మార్పుతో ఈ తరహా చిత్రాల ట్రెండ్ తారా స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా క్రీడా బయోపిక్ లు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతుండటంతో మేకర్స్ ఆ తరహా కథలవైపే మొగ్గు చూపిస్తున్నారు.

తాజా సమాచారం ప్రకారం.. ఓ క్రేజీ క్రీడా బయోపిక్ తెరపైకి రాబోతోంది. తమిళంలో `మక్కల్ సెల్వన్ గా పేరు తెచ్చుకున్న విజయ్ సేతుపతి ఈ బయోపిక్ లో నటించనున్నారు. శ్రీలంక లెజెండరీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ జీవిత కథ ఆధారంగా రూపొందనున్న బయోపిక్ లో టైటిల్ పాత్రధారిగా విజయ్ సేతుపతి కనిపించబోతున్నారు. స్పిన్ మాయాజాలంతో శ్రీలంక జట్టుకు ఎన్నో చిరస్మరణీయమైన విజయాల్ని అందించి టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యధిక వికెట్లు పడగొట్టిన ఆటగాడిగా ముత్తయ్య మురళీధరన్ రికార్డు సృష్టించాడు. అతని బౌలింగ్ సరళిపై ఇతర దేశాలకు చెందిన ఆటగాళ్లు అభ్యంతరాలు వ్యక్తం చేసి వివాదాలు సృష్టించినా అతనికి శ్రీలంకన్ ప్రజలతో పాటు తమిళులంతా అండగా నిలిచారు.

ఈ సినిమాలో సక్సెస్ ల కింగ్ సేతుపతి నటిస్తున్నారన్న వార్త వైరల్ గా మారింది. ఇటీవల సేతుపతి ప్రయోగాల గురించి తెలిసిందే. అతడు ఏది చేపడితే అది బ్లాక్ బస్టర్ అయ్యి తీరుతోంది. సహజ నటుడిగా సేతుపతి వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే ప్రాధాన్యత వున్న పాత్రల్లో గెస్ట్‌గా నటిస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న `సైరా`లోనూ అతడు ఓ ఆసక్తికర పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజా బయోపిక్ వార్తలతో మరోసారి అతడి పేరు మార్మోగిపోతోంది.
Please Read Disclaimer