తండ్రితో ఎంట్రీ.. కొడుకుతో రీఎంట్రీ

0

కొన్ని కాంబినేషన్లు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. భిన్నమైన కాంబినేషన్లు ఓకే అన్నంతనే.. లింకు వేసి.. చెప్పే ధోరణి మీడియాలో కనిపిస్తుంటుంది. అయితే.. తన విషయంలో అందరూ మిస్ అయిన పాయింట్ ను చెప్పిన విజయశాంతి అందరిని ఆశ్చర్యపర్చటమే కాదు.. అవును కదా?.. భలే మిస్ అయ్యామే అన్న భావన కలిగేలా చేశారు తన మాటలతో.

తాజాగా ఆమె నటించిన సరిలేరు నీకెవ్వరూ మూవీ ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను ఏర్పాటు చేశారు. ఇందులో మాట్లాడిన విజయశాంతి ఒక ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చారు. తాను 1979 నుంచి ఇప్పటి వరకూ సుదీర్ఘమైన మూవీ జర్నీ చేసిన విషయాన్ని చెబుతూ.. ఒక కొత్త విషయాన్ని చెప్పుకొచ్చారు.

సూపర్ స్టార్ కృష్ణ దర్శకత్వంలో చేసిన సినిమాలో తనను హీరోయిన్ గా పరిచయం చేశారని.. పదిహేనేళ్ల గ్యాప్ తర్వాత వాళ్ల అబ్బాయి సినిమాతో తాను రీ ఎంట్రీ ఇవ్వటాన్ని ప్రస్తావించారు. సినిమా ఇండస్ట్రీలో కృష్ణ తనకు ఎంట్రీ ఇప్పిస్తే.. మహేశ్ మూవీతో తాను రీ ఎంట్రీ కావటం ఆశ్చర్యంగా ఉన్నట్లు చెప్పారు. తండ్ రితో ఎంట్రీ.. కొడుకుతో రీఎంట్రీ అంటూ విజయశాంతి చెప్పినప్పుడు కానీ.. ఆ ఆసక్తికర విషయం ఎవరికి గుర్తుకు రాని పరిస్థితి. ఇక.. మహేశ్ ను ఉద్దేశించి విజయశాంతి విపరీతంగా పొగిడేశారు.

చిన్నప్పుడు మహేశ్ ను చూస్తుంటే చాలా క్యూట్ గా ఉండేవారని.. మహేశ్ 24 క్యారెట్ల బంగారమన్నారు. జెంటిల్ మెన్.. సూపర్ స్టార్ అన్న పదానికి అర్థం మహేశ్ బాబు. ఎదిగినా ఒదిగి ఉండటంలో మహేశ్ ను మించిన వారు ఎవరూ లేదరన్నారు. తామిద్దరి కాంబినేషన్ లో వచ్చే సీన్లు బాగుంటాయన్న విజయశాంతి.. మహేశ్ బాబు చేస్తున్న సామాజిక కార్యక్రమాలు చూసి తాను ఆశ్చర్యపోయినట్లు చెప్పారు. మహేశ్ నిజంగానే బయట కూడా సూపర్ స్టారే అని పొగిడేశారు. ఇప్పటివరకూ ఎవరూ పొగడని రీతిలో మహేశ్ ను విజయశాంతి పొగిడేశారు.
Please Read Disclaimer