ట్రెండీ టాక్: హీరో లో విలనిజం

0

హీరో లో విలన్ క్వాలిటీ.. ఇలా కుదిరేది ఎందరికి? కానీ ఆ హీరో విలన్ గానూ కాకలు పుట్టించబోతున్నాడు. నేనే హీరో నేనే విలన్..! దేనికైనా నేనే..!! అంటూ చెలరేగుతున్నాడు. ఇంతకీ ఎవరా హీరో కం విలన్? అంటే అలాంటి అరుడైన క్వాలిటీ తంబీ విజయ్ సేతుపతిలో కనిపిస్తోంది. విశ్వనటుడు కమల్ హాసన్.. చియాన్ విక్రమ్ తరహాలోనే ప్రయోగాల బాటలో ప్రశంసలు దక్కించుకుంటున్న సేతుపతి ఆలోచనలు ఏ ఇతర హీరోతో పోల్చినా ఎంతో విభిన్నం.

ఇటీవలే `సైరా` లాంటి పాన్ ఇండియా చిత్రంలో అతిధి పాత్ర లో నటించిన సేతుపతి టాలీవుడ్ లో తన గ్రాఫ్ ని అంతకంతకు పెంచుకునే పనిలో ఉన్నాడు. ఆ క్రమంలోనే ఇక్కడ విలన్ పాత్రలకు అంగీకరిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో ఇప్పటికిప్పుడు ఓ రెండు క్రేజీ చిత్రాల్లో విలన్ గా నటిస్తున్నాడు. సాయి తేజ్ సోదరుడు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ డెబ్యూ చిత్రం ఉప్పెన లో సేతుపతి విలనీ మైమరిపిస్తుందట. అలాగే అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ మూవీలోనూ విలన్ గా నటించేందుకు అంగీకరించాడు. ఈ రెండు చిత్రాలు 2020లో రిలీజ్ కానున్నాయి.

అటు తమిళంలోనూ భారీ చిత్రాల్లో విలన్ గా నటిస్తున్నాడు. విజయ్ కథానాయకుడి గా నటిస్తున్న దళపతి 64లో ప్రధాన విలన్ గా నటించనున్నాడు. 2020 వేసవిలో ఈ సినిమా రిలీజ్ కానుంది. విశ్వనటుడు కమల్ హాసన్ నటిస్తున్న భారతీయుడు 2లోనూ ప్రధాన విలన్ గా నటిస్తున్నాడు. 2020 దీపావళికి ఈ చిత్రం రిలీజ్ కానుంది. సేతుపతి విలన్ గా నటించిన నాలుగు చిత్రాలు ( తెలుగులో రెండు.. తమిళం లో రెండు) 2020లో రిలీజ్ కి రానున్నాయి. సేతుపతి లోని విలనిజం ఏ మేరకు మెప్పించనుంది అన్నది చూడాలి.
Please Read Disclaimer