‘బాలాకోట్ – ది ట్రూ స్టోరీ’ చెప్పనున్న స్టార్ హీరో

0

పుల్వామాలో ఉగ్రవాదులు బాంబు దాడులు చేసి దాదాపు 40 మంది ఇండియన్ జవాన్లను చంపేసిన విషయం తెల్సిందే. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫిబ్రవరి 26న పాకిస్తాన్ లోని బాలాకోట్ లో ఉగ్రవాదుల స్థావరాలను భూ స్థాపితం చేసిన విషయం తెల్సిందే. బాలాకోట్ పై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన మెరుపు దాడితో పాకిస్థాన్ షాక్ అయ్యింది. ఇండియా జోలికి వచ్చేందుకు భయపడేలా బాలాకోట్ దాడులను మిరాజ్ యుద్ద విమానాలతో చేయడం జరిగింది. ఇండియన్స్ మొత్తం సగర్వంగా చెప్పుకున్న బాలాకోట్ దాడులు అంతకు ముందు జరిగిన పరిణామాలు మరియు ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఒక చిత్రం రాబోతుంది.

బాలాకోట్ దాడులు జరిగినప్పటి నుండి కూడా ఆ నేపథ్యంలో సినిమాలను తెరకెక్కించేందుకు పలువురు ఫిల్మ్ మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. గతంలో సర్జికల్ స్టైక్స్ నేపథ్యంలో వచ్చిన ‘యురి’ చిత్రం మంచి విజయాన్ని దక్కించుకున్న నేపథ్యంలో బాలాకోట్ దాడుల గురించి సినిమా చేసి క్యాష్ చేసుకునేందుకు చాలా మంది నిర్మాతలు సన్నాహాలు చేశారు. తాజాగా బాలీవుడ్ హీరో వివేక్ ఒబేరాయ్ కూడా బాలాకోట్ దాడుల నేపథ్యంలో సినిమాను చేయబోతున్నట్లుగా ప్రకటించాడు.

‘బాలాకోట్ – ది ట్రూ స్టోరీ’ టైటిల్ తో వివేక్ సినిమాను నిర్మించబోతున్నట్లుగా ప్రకటించాడు. ఈ చిత్రంలో వివేక్ ఒబేరాయ్ కూడా నటించే అవకాశం ఉంది. ఇక ఈ చిత్రంలో భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ పాత్ర కూడా ఉంటుందని ఆయన చెప్పాడు. బాలాకోట్ దాడి తర్వాత పాకిస్థాన్ ప్రతీకార దాడికి ప్రయత్నించింది. కాని పాక్ దాడిని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సమర్ధవంతంగా ఎదుర్కొంది.

ఆ సమయంలో వింగ్ కమాండర్ అభినందన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో క్రాష్ ల్యాండ్ అవ్వడం.. అక్కడ పాక్ సైనికులు అభినందన్ ను అదుపులోకి తీసుకోవడం.. ఎంతగా ఇబ్బందులు పెట్టినా కూడా ఇండియన్ ఆర్మీకి సంబంధించి ఎలాంటి రహస్యాలను అభినందన్ బయటకు చెప్పకుండా ధైర్యంగా ఉన్నాడు. మూడు రోజుల పాటు పాక్ ఆర్మీ చెరలో ఉన్న అభినందన్ సేఫ్ గా ఇండియాకు తిరిగి వచ్చాడు. ఆ పాత్రను కూడా సినిమాలో ప్రముఖంగా చూపించబోతున్నట్లుగా వివేక్ ఒబేరాయ్ చెప్పాడు.

ఈ చిత్రాన్ని నిర్మించడం ఒక పౌరుడిగా నా బాధ్యత అని మన సైన్యం గొప్పతనం.. అభినందన్ వంటి పరాక్రమవంతుల గురించి ప్రజలకు చెప్పడం ఆనందంగా ఉందని వివేక్ చెప్పుకొచ్చాడు. సినిమా నిర్మాణంకు సంబంధించిన అన్ని అనుమతులను ఎయిర్ ఫోర్స్ నుండి తీసుకున్నట్లుగా వివేక్ ఒబేరాయ్ పేర్కొన్నాడు. త్వరలోనే సినిమాకు సంబంధించిన నటీనటులు మరియు సాంకేతిక నిపుణులను వివేక్ ఒబేరాయ్ ప్రకటించనున్నట్లుగా చెప్పుకొచ్చాడు.




Please Read Disclaimer