‘పెళ్లి అనేది మా ఇంట్లో వ్యవహారం.. పబ్లిక్ పండుగ కాదు’

0

మెగా డాటర్ నిహారిక కొణిదెల త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న విషయం తెలిసిందే. జొన్నలగడ్డ చైతన్య అనే అబ్బాయితో నిహారిక పెళ్లి చేయడానికి మెగా ఫ్యామిలీ సభ్యులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో మెగా బ్రదర్ నాగబాబు తన కుమార్తె నిహారిక కొణిదెల వివాహం గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ”మీ అమ్మాయి నిహారిక పెళ్లి కూడా ఖాయమైంది. ఆ పెళ్లి సంగతులేంటి? ఎప్పుడు పెళ్లి పెట్టుకుంటున్నారు?” అని సదరు యాంకర్ ప్రశ్నించగా దీనికి నాగబాబు ఆసక్తికరంగా సమాధానం ఇచ్చారు. ”అది మా ఇంట్లో పెళ్లి.. పబ్లిక్ పండుగ కాదు.. త్వరలోనే నిశ్చితార్థం పెట్టుకుంటాం.. నిశ్చితార్థం అయ్యాక అన్నీ చెబుతాం” అని నాగబాబు చెప్పారట.

ఇంకా నాగబాబు మాట్లాడుతూ.. నిహారిక పెళ్లి అనేది తమ కుటుంబానికి సంబంధించిన వ్యవహారం.. కాబట్టి పర్సనల్ గానే ట్రీట్ చేస్తున్నామని.. కరోనా కారణంగా హంగూ ఆర్భాటాలతో అట్టహాసంగా పెళ్లి చేయడం కుదరకపోవచ్చని.. ప్రభుత్వ నిబంధనలు అనుసరిస్తూనే పెళ్లి చేయాల్సి వస్తుందని నాగబాబు వెల్లడించారట. ఇక నిహారిక పెళ్లిని కేవలం అతి దగ్గరి సన్నిహితుల మధ్య జరిపినా ఆశ్ఛర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారట. ఇక చైతన్య జొన్నలగడ్డ – నిహారికల ఎంగేజ్మెంట్ ఆగస్ట్ లో జరిగే అవకాశం ఉందని.. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి వేడుక నిర్వహించే అవకాశం ఉందని సన్నిహిత వర్గాలవారు అనుకుంటున్నారు. కాగా టాలీవుడ్ లో ప్రస్తుతం పెళ్లి సందడి నడుస్తోందని చెప్పవచ్చు. ఇప్పటికే హీరో నిఖిల్ సిద్దార్థ్ ఓ ఇంటి వాడు అయ్యాడు. ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా వివాహం చేసుకున్నారు. ఇక హీరో నితిన్ జూలై 26న పెళ్లి చేసుకోడానికి రెడీ అవ్వగా దగ్గుబాటి రానా ఆగష్టు 8న పెళ్లి పీటలు ఎక్కనున్నారు.