జేజమ్మ కంబ్యాక్ ఎప్పుడు?

0

నాగార్జున సరసన `సూపర్` చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంటరైంది కన్నడ బ్యూటీ అనుష్క. ఆరంభం రెగ్యులర్ కమర్షియల్ నాయిక గానే పేరు తెచ్చుకున్నా`అరుంధతి` సంచలనాలతో స్వీటీ గ్రాఫ్ అనూహ్యంగా మారిపోయింది. జేజమ్మగా.. స్వీటీగా ఆ చిత్రంలో రెండు విలక్షణ పాత్రల్లో వైవిధ్యమైన నటనతో అనుష్క మెప్పించిన తీరుకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. బాక్సాఫీస్ వద్ద ఓ స్టార్ హీరో సినిమా స్థాయి వసూళ్లతో ట్రేడ్ పండితుల్ని విస్మయానికి గురిచేసింది. ఈ సినిమా అందించిన నమ్మకంతో అనుష్కని ప్రధాన భూమికగా చేసుకుని దర్శక రచయితలు కథలు రాయడం మొదలు పెట్టారు.

ఆ తర్వాత రుద్రమదేవిగా అద్భుత అభినయంతో ఆకట్టుకుని బాహుబలి లో దేవసేనగా జాతీయ స్థాయి పాపులారిటీ దక్కించుకుంది. భాగమతి చిత్రంతో మరోసారి బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. భాగమతి పాత్ర అనుష్క కోసమే ప్రత్యేకించి డిజైన్ చేయడం ఆసక్తిని రేకెత్తించింది. ఒక కథానాయకుడి స్థాయిలో వసూళ్లు తేగలిగే సత్తా తనకు ఉందని ప్రూవైంది.

తాజాగా అనుష్క ప్రధాన పాత్రలో వస్తున్న `నిశ్శబ్దం` హారర్ థ్రిల్లర్ జోనర్ లో ఆసక్తిని పెంచింది. ఈ చిత్రాన్ని హేమంత్ మధుకర్ తెరకెక్కిస్తున్నారు. హాలీవుడ్ స్థాయి టేకింగ్తో నాలుగు భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రం రూపొందుతోంది. స్టార్ హీరో స్థాయి క్రేజ్ని.. మార్కెట్ ని సొంతం చేసుకున్న అనుష్క ఈ చిత్రంలో మూగ.. చెవిటి యువతిగా విభిన్నమైన పాత్రలో కనిపించబోతోంది. ఆమెకు జోడీగా మాధవన్ నటిస్తున్నారు. అంజలి- శాలిని పాండే కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గురువారం అనుష్క పుట్టిన రోజు సందర్భంగా చిత్ర బృందం ఇప్పటికే టీజర్ ని విడుదల చేసింది. టీజర్ కి స్పందన బావుంది. అయితే ఈ చిత్రంతో అనుష్క కంబ్యాక్ అవుతుందా? అన్నది చూడాలి. నేడు అనుష్క బర్త్ డే సందర్భంగా ప్రత్యేకించి తుపాకి తరపున శుభాకాంక్షలు.
Please Read Disclaimer