నేను ప్రేమించిన అమ్మాయి పేరు తప్ప అన్నీ వచ్చాయి!

0

యువ హీరో సందీప్ కిషన్ తాజా చిత్రం ‘నిను వీడని నీడను నేనే’ జులై 12 న విడుదలకు సిద్ధం అవుతోంది. ఈమధ్య సందీప్ కిషన్ నటించిన సినిమాలేవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. తమిళంలో ఒకటి అరా విజయాలు లభించినా తెలుగులో మాత్రం వరస ఫెయిల్యూర్లతో ఇబ్బంది పడుతున్నాడు. దీంతో సందీప్ తన కొత్తసినిమాపైనే నమ్మకం పెట్టుకున్నాడు.

ప్రస్తుతం సందీప్ ఈ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు. రీసెంట్ గా సందీప్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నాడు. దాదాపు నాలుగేళ్ళుగా ఫెయిల్యూర్స్ ఎదురవుతున్నా సందీప్ హీరోగా కొనసాగడానికి తనకున్న బ్యాక్ గ్రౌండే కారణమని.. మేనమామ ఛోటా కె నాయుడు వల్లే అది సాధ్యమైందని బయట టాక్ ఉంది. ఈ విషయాన్నే సందీప్ తో ప్రస్తావిస్తే అది నిజం కాదన్నాడు. మామ సపోర్ట్ తనకు ఉన్నమాట నిజమే కానీ దాని వల్లే హీరోగా కొనసాగుతున్నానని అనడం సరి కాదన్నాడు. నేపథ్యం లేని ఇతర హీరోలతో పోలిస్తే తనకు కెరీర్ ప్రారంభంలో కొంత ఎడ్వాంటేజ్ ఉన్నమాట నిజమేనని ఒప్పుకుంటూ.. నాని.. నిఖిల్ లాంటి బ్యాక్ గ్రౌండ్ లేని హీరోలతో పోలిస్తే తనకు స్టార్టింగ్ లో ఓ 20% ఎడ్వాంటేజ్ ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశాడు. అయితే తనను ఇప్పటివరకూ నడిపించింది తన ప్యాషన్ అని చెప్పాడు.

ఇక గతంలో హీరోయిన్ రెజీనా తో ఎఫైర్ వార్తలు వచ్చాయి కదా అని అడిగితే అవన్నీ రూమర్లని.. రెజినా తనకు మంచి ఫ్రెండ్ అని చెప్పాడు. అంతే కాదు. అసలు తను నిజంగా ప్రేమించిన అమ్మాయి పేరు మీడియాలో ఎప్పుడూ రాలేదని.. ఆ అమ్మాయి పేరు తప్ప మిగతా పేర్లన్నీ వచ్చాయని నవ్వేశాడు. కానీ ఆ ప్రేమించిన అమ్మాయి పేరును సందీప్ చెప్పలేదు. సదరు ఇంటర్వ్యూయర్ కూడా ఆ సంగతి అడగలేదు!

‘నిను వీడని నీడను నేనే’ తో సందీప్ మొదటిసారిగా నిర్మాత అవతారం ఎత్తాడు. సందీప్ కిషన్ ఈ సినిమాతో కార్తీక్ రాజు అనే నూతన దర్శకుడిని టాలీవుడ్ కు పరిచయం చేస్తున్నాడు. ‘నిను వీడని నీడను నేనే’ ప్రోమోస్ అయితే ఇంట్రెస్టింగ్ గానే ఉన్నాయి. మరి ఈ సినిమాతో అయినా సందీప్ కు మంచి విజయం లభిస్తుందో లేదో వేచి చూడాలి.
Please Read Disclaimer