మహేష్ సినిమా.. ఆ మూడు కోట్లు ఎవరివ్వాలి?

0ఎట్టకేలకు మహేష్ బాబు కొత్త సినిమా షూటింగ్ మొదలవబోతోంది అనుకుంటుండగా పెద్ద కష్టమే వచ్చి పడింది. ఈ చిత్ర షూటింగ్ పై స్టే విధించాలంటూ పొట్లూరి వరప్రసాద్ వేసిన పిటిషన్ ను విచారించిన మద్రాస్ హైకోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. దీంతో డెహ్రాడూన్ లో షూటింగ్ కోసం ఏర్పాట్లు చేసుకుని రెడీ అయిన చిత్ర బృందం తమ పని ఆపేసి వెనక్కి రావాల్సిన పరిస్థితి తలెత్తింది. కాదని వెనక్కి వెళ్తే కోర్టు ధిక్కారం కింద తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉండటంతో చిత్ర బృందానికి ఎటూ పాలుపోని పరిస్థితి నెలకొంది. మహేష్ లాంటి పెద్ద హీరో సినిమాకు ఇలాంటి పరిస్థితి ఎదురు కావడం.. వివాదాన్ని పరిష్కరించుకోకుండా.. పరిణామాలు ఆలోచించకుండా నిర్మాతలు దిల్ రాజు.. అశ్వినీదత్ షూటింగ్ కు వెళ్లివపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే.

ఈ విషయంలో అసలు మహేష్ ఏమీ చేయలేకపోవడమూ ఆశ్చర్యంగా అనిపిస్తోంది. కానీ నిజానికి మహేష్.. అతడి భార్య నమ్రత ఈ వివాదాన్ని పరిష్కరించడానికి తమ వంతుగా గట్టి ప్రయత్నమే చేశారట. నమ్రత.. కొన్ని నెలల కిందటే పీవీపీని కలిసి.. ఈ చిత్రంలో మైనర్ పార్టనర్ గా ఉండేలా చూస్తానని చెప్పారట. కానీ నిర్మాత దిల్ రాజు అందుకు అంగీకరించలేదని అంటున్నారు. పీవీపీ కోర్టుకెక్కినా తీర్పు తమకు అనుకూలంగానే వస్తుందన్న ధీమాతో ఉన్న రాజు.. ఇప్పటికే అశ్వినీదత్ నిర్మాణ భాగస్వామిగా ఉన్న నేపథ్యంలో పీవీపీని చేర్చుకోవడానికి ఇష్టపడలేదట. ఐతే ఈ చిత్ర స్క్రిప్ట్ వర్క్.. ప్రి ప్రొడక్షన్ తమ ప్రొడక్షన్ హౌజ్ ఆధ్వర్యంలోనే జరగడంతో రూ.3 కోట్లు ఖర్చయిందని.. మధ్యలో తనను కాదని వేరే నిర్మాతల్ని చూసుకున్న వంశీ పైడిపల్లిని తేలిగ్గా వదిలే ప్రసక్తే లేదని పీవీపీ అంటున్నారట. ఐతే ఇప్పటికే బడ్జెట్ అనుకున్న దాని కంటే ఎక్కువ అయిందని.. ఇంకో రూ.3 కోట్లు చెల్లించడానికి తాము సిద్ధంగా లేమని రాజు-దత్ అంటున్నట్లు సమాచారం. అలాగని మహేష్ కూడా దీన్ని భరించే పరిస్థితిలో లేడు. వంశీకి కూడా అది భారమే. అందుకే ఎవరికి వాళ్లు సైలెంటుగా ఉండిపోయారు. ఏమైతే అది కానివ్వండన్నట్లు షూటింగుకి సన్నాహాలు చేసుకున్నారు. ఇప్పుడు సినిమానే ఆగిపోయే పరిస్థితి వచ్చింది. మరి సమస్యను ఎలా పరిష్కరించుకుంటారో చూడాలి.