విశాల్ పెళ్లి క్యాన్సిల్?..ఎందుకిలా అనుకుంటున్నారంటే?

0

సినీ ప్రముఖుల పెళ్లిళ్లు.. వారి వ్యక్తిగత విషయాల మీద ఆసక్తి ఎక్కువ. మనం ఉండే వీధిలో ఒకరింట్లో పెళ్లి ఆగిపోయిందంటే ఎంతలా మాట్లాడుకుంటామో.. మరెంతగా ప్రాధాన్యత ఇస్తామో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజల మనసుల్లో సినీ ప్రముఖులకు ఉండే స్థానం అంతా ఇంతా కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే వారికి ప్రముఖులంతా తమ వీధిలో ఉండేవారిగానే భావిస్తుంటారు. ఈ కారణంతోనే వారికి సంబంధించిన ప్రతి విషయానికి ప్రాధాన్యతను ఇస్తుంటారు.

తాజాగా తమిళ.. తెలుగు సినీ అభిమానులకు సుపరిచితుడైన హీరో విశాల్ పెళ్లికి సంబంధించి ఒక షాకింగ్ వార్త ప్రచారంలోకి వచ్చింది. అధికారికంగా ఈ విషయాన్ని ఎవరూ కన్ఫర్మ్ చేయనప్పటికీ లాజిక్ గా చూసినప్పుడు.. ఈ విషయం నిజమేనన్న భావనను కలుగజేస్తోంది. హీరో విశాల్ కు హైదరాబాద్ కు చెందిన అనీశా అనే అమ్మాయితో ఎంగేజ్ మెంట్ జరగటం తెలిసిందే.

ఈ ఏడాది మార్చి 10న ఎంగేజ్ మెంట్ అయిన నాటి నుంచి వీరికి సంబంధించిన పర్సనల్ ఫోటోలు చాలానే సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. అనీశా గురించి విశాల్ ప్రస్తావిస్తూ పలు సందర్భాల్లో ఎమోషనల్ అయ్యారు. దేవుడు తన కోసమే అనీశాను పంపినట్లుగా విశాల్ పేర్కొన్నారు.

టెంపర్ తమిళ రీమేక్ అయోగ్య చిత్రం షూటింగ్ ను విశాఖపట్నంలో జరుపుతున్న వేళలో అనీశాతో తనకు పరిచయం జరిగిందని విశాల్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా సోషల్ మీడియాలో విశాల్ తో ఉన్న ఫోటోల్ని అనీశా డిలీట్ చేయటం ప్రారంభించింది. దీంతో.. పెళ్లి రద్దు అయ్యిందా? అన్న అనుమానాలు మొదలయ్యాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇటీవల వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చినట్లుగా చెబుతున్నారు.

దీంతో.. పెళ్లి రద్దు చేసుకునే వరకూ వెళ్లినట్లుగా సమాచారం. ఎంగేజ్ మెంట్ తర్వాత విశాల్ నటిస్తున్న చిత్ర షూటింగ్ టర్కీలో జరిగింది. దీంతో అనీశాను కూడా తనతో పాటు టర్కీకి తీసుకెళ్లారు విశాల్. అలా వివాహ బంధం కంటే ముందే బాగా దగ్గరవుతున్న ఈ జంట మధ్య అకస్మాత్తుగా విభేదాలు పొడచూపినట్లుగా చెబుతున్నారు. ఈ కారణంతోనే తన సోషల్ మీడియా అకౌంట్లో అనీశా విశాల్ తో ఉన్న ఎంగేజ్ మెంట్ ఫోటోల్ని డిలీట్ చేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే.. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం బయటకు రాలేదు. మరీ ప్రచారంలో నిజమెంతో చూడాలి.
Please Read Disclaimer