Templates by BIGtheme NET
Home >> Cinema News >> ఆర్జీవీ అందుకే మకాం మార్చాడా…?

ఆర్జీవీ అందుకే మకాం మార్చాడా…?


సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ శివ’ సినిమాతో సినీ ఇండస్ట్రీలో పెను మార్పులకు కారణమయ్యాడు. అప్పటి వరకూ మూసధోరణిలో వెళ్తున్న సినిమాకి కొత్త దారి చూపించాడు. డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో.. అసాధారణమైన కెమెరా యాంగిల్స్ తో.. కొత్త సౌండింగ్ తో చరిత్ర నిలిచిపోయే విధంగా ‘శివ’ సినిమా రూపొందించాడు. అక్కినేని నాగార్జున హీరోగా నటించిన ‘శివ’ సినిమా వచ్చి ముప్పై ఏళ్ళు దాటిపోయినా ఇంకా ఆ సినిమా గురించి మాట్లాడుకుంటున్నామంటే అది ఏ రేంజ్ లో ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో ‘గాయం’ ‘క్షణక్షణం’ ‘అంతం’ ‘రాత్రి’ వంటి సినిమాలు అందించాడు. అయితే ‘గోవిందా గోవిందా’ సినిమాలో కొన్ని సన్నివేశాల విషయంలో సెన్సార్ బోర్డ్ వారు అభ్యంతరం తెలపడంతో ఇంక తెలుగులో సినిమాలు తీయను అని ప్రతిజ్ఞ పూని బాలీవుడ్ కి మకాం మార్చాడు.

హిందీలో ‘సత్య’ ‘కంపెనీ’ ‘రంగీలా’ ‘భూత్’ ‘సర్కార్’ ‘సర్కార్ రాజ్’ వంటి సినిమాలు అందించిన రామ్ గోపాల్ వర్మ అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే నిలకడలేని ఆర్జీవీ మాట మీద నిలబడను అంటూ మళ్ళీ తెలుగులో సినిమాలు తీయడం స్టార్ట్ చేసాడు. అయితే ఒకప్పటిలా క్రియేటివ్ సినిమాలు కాకుండా ‘అడవి’ ‘ఐస్ క్రీమ్’ ‘అనుక్షణం’ ‘ఆఫీసర్’ ‘నగ్నం’ ‘క్లైమాక్స్’ వంటి నాసిరకం సినిమాలు చూపిస్తున్నాడు. ఒకప్పుడు ఇండస్ట్రీకి కొత్తదారి చూపించిన సినిమాలు తీసి క్రియేటివ్ డైరెక్టర్ అనిపించుకున్న ఆర్జీవీ.. ఇప్పుడు మాత్రం బూతు సినిమాల డైరెక్టర్ అనిపించుకున్నాడు. ఇక బాలీవుడ్ లో సైతం వర్మను వర్మ సినిమాలను పట్టించుకోవడం ఎప్పుడో మానేశారని అనుకుంటుంటారు. అందుకే బాలీవుడ్ నుంచి మకాం మార్చి టాలీవుడ్ లో కంపెనీ ఓపెన్ చేసాడని కామెంట్స్ వినిపిస్తుంటాయి.

ఇదిలా ఉండగా బాలీవుడ్ లో ప్రస్తుతం ఆర్జీవీకి ఉన్న క్రేజ్ గురించి తెలియపరిచే రెండు విషయాలు జరిగాయి. వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘సత్య’ సినిమా ఇండస్ట్రీని షేక్ చేసిన సంగతి తెలిసిందే. ‘సత్య’ సినిమా విడుదలై 20 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఈ మధ్య బాలీవుడ్ మీడియా ఈ సినిమా గురించి మంచి కథనాలు వెలువరించింది. అయితే వాటిలో ఎక్కడ కూడా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పేరు ప్రస్తావించకపోవడం ఆశ్చర్యకరం. ఈ సినిమాలో నటించిన ఆర్టిస్టుల దగ్గర నుండి ఇతర టెక్నీషియన్ల వరకు అందరితో మాట్లాడి వారి అనుభవాలను తెలుసుకున్నారు. కానీ డైరెక్టర్ వర్మను మాత్రం పట్టించుకోవడం లేదు.

అంతేకాకుండా ‘రంగీలా’ సినిమా 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంలో కూడా బాలీవుడ్ మీడియా వర్మ విషయంలో ఇలానే వ్యవహరించింది. ఒక సినిమా చరిత్రలో నిలిచిపోయే చిత్రంగా గుర్తింపు పొందిదంటే అందులో దర్శకుడికే సింహభాగం క్రెడిట్ వెళ్తుంది. ఇలాంటిది హిందీ మీడియా మాత్రం ఆర్జీవీని సంప్రదించి అతని అనుభవాలు తెలుసుకోవాలని అనుకోలేదు. దీనిని బట్టే వర్మకి ఇప్పుడు బాలీవుడ్ లో ఎలాంటి గౌరవం ఇస్తున్నారో తెలుస్తోందని కామెంట్స్ వస్తున్నాయి. అక్కడ తనని గుర్తించకపోవడం వల్లనే మకాం మార్చి టాలీవుడ్ లో కంపెనీ ఓపెన్ చేశాడని యాంటీ ఆర్జీవీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.