50 మంది గిల్డ్ నిర్మాతలు మిస్సింగ్!!

0

దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత తెలుగు సినిమా నిర్మాతల మండలికి ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఆదివారం (జూన్ 30న) నిర్మాతల మండలి ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఈ తొమ్మిదేళ్ల కాలంలో మండలికి ఎన్నికలు ఎందుకు జరగలేదు? అంటే .. నిరంతరం ఏదో ఒక వివాదంతో మండలి వ్యవహారాలు రచ్చకెక్కాయి. నిర్మాతల మండలిలోని రకరకాల ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి తేడాలు జరగడంతో కరెక్షన్ చేసేందుకు పలువురు పెద్దలు ప్రయత్నించారు. ఆ క్రమంలోనే మండలి నుంచి కొందరిని దూరం పెట్టారని అప్పట్లో ప్రచారమైంది.

అంతేకాదు అసలు సినిమాలు తీయకుండా మండలి నిధితో ప్రతిఫలాలు పొందేవాళ్లే ఎక్కువ కావడంతో రెగ్యులర్ గా సినిమాలు తీసే యాక్టివ్ నిర్మాతలంతా మండలిని వెలివేశారు. దాదాపు 50 మంది ఎల్.ఎల్.పి పేరుతో బయటకు వెళ్లి సొంతంగా సంఘాన్ని పెట్టుకున్నారు. ఆ తర్వాత ఎల్.ఎల్.పి కాస్తా నిర్మాతల గిల్డ్ గానూ మారింది. అయితే వీళ్లు ఈ దఫా ఎన్నికల్లో పాల్గొంటున్నారా? అంటే ఇంతవరకూ ఎలాంటి సమాచారం లేదు. అయితే గిల్డ్ నిర్మాతలు స్వతంత్య్రంగా వ్యవహరిస్తూ పరిశ్రమ సమస్యల్ని పరిష్కరించేందుకు ఆలోచిస్తారని తెలిసింది. అలాగే ఇరు తెలుగు రాష్ట్రాల సినిమాటోగ్రఫీ శాఖతోనూ గిల్డ్ అనుసంధానమై పని చేస్తుందట. పరిశ్రమ అవసరాల్ని.. సమస్యల విషయమై ప్రభుత్వంతో రాయబారం నెరిపేది వీళ్లేనని తెలుస్తోంది.

తాజా సమాచారం ప్రకారం.. పరిశ్రమకు ఎంతో కీలకమైన నిర్మాతల గిల్డ్ సభ్యులెవరూ తాజా ఎన్నికల్లో ఎలాంటి భూమికను పోషించడం లేదని తెలుస్తోంది. తమతో సంప్రదింపులు జరిపిన సి.కళ్యాణ్ ప్రభృతుల ప్రయత్నం సఫలం కాలేదు. దీంతో ఆ యాభై మంది సినిమాలు తీసేవాళ్లు ఇక ఎప్పటికీ నిర్మాతల మండలితో కలవరన్న మాట ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే ఎవరు వచ్చినా రాకపోయినా ఉన్నవాళ్లతోనే ఎలక్షన్స్ జరిపిస్తామని నిర్మాత సి.కళ్యాణ్ ప్రకటించారు. ఈసారి సి.కళ్యాణ్ ప్యానెల్ తో పాటుగా వేరొక ప్యానెల్ ఎన్నికల్లో పోటీకి దిగుతోందని నిర్మాతల మండలి పెద్దాయన ఒకరు ఇదివరకూ రివీల్ చేశారు. అసలు మండలిలో ఏం జరుగుతోంది? మునుముందు ఏం జరగబోతోంది? ఇప్పుడున్న అపసవ్య దిశనుంచి బయటపడేసేందుకు ఏం చేయబోతున్నారు? ఇవన్నీ శేష ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. సినిమాలు తీయని వాళ్ల సంఘంగా నిర్మాతల సంఘం మిగిలిపోనుందా? ఏవో రెండు మూడు సినిమాలు తీసి మేం కూడా నిర్మాతలమేనని తిష్ఠ వేసుకుని కూచున్న వాళ్లను ప్రక్షాళన చేయరా? నిర్మాతల మండలిలో కొనసాగాలంటే రెగ్యులర్ గా సినిమాలు తీయాలన్న నియమనిబంధనను తీసుకు రాలేరా? ఏళ్లకు ఏళ్లు సినిమాలు తీయకుండా హెల్త్- యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్.. హౌసింగ్ స్కీమ్ లు అంటూ లబ్ధి పొందుతామంటే అది కరక్టేనా? పైగా సినిమాలు తీసే ఆ కొందరిపై సినిమాలు తీయని వాళ్ల పెత్తనమేంటి? ఇలా విక్రమార్కుని బుర్రలో జవాబుల్లేని ప్రశ్నలెన్నో. మరి వీటన్నిటికీ ఏనాటికైనా సమాధానం దొరుకుతుందంటారా? ఈసారి ఎలక్షన్ జరిగినా దానివల్ల ఎవరికి ప్రయోజనం? అన్నది చూడాలి.
Please Read Disclaimer