కేరళకే ఎందుకు కోనసీమలో లేవా?

0

సూపర్ స్టార్ మహేష్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆ ప్రాంతానికి బ్రాండింగ్ అదిరిపోతుంది. ఇంతకుముందు 1-నేనొక్కడినే కోసం లండన్ వెళితే ఆ నగరంపై తెలుగు రాష్ట్రాల్లో అవగాహన వచ్చింది. అక్కడ భారీ బిల్డింగులు అందమైన లొకేషన్లు జనాల కళ్లలో ఇంకిపోయాయి. కాస్ట్ లీ అద్దాల మేడల్ని అసలే మర్చిపోలేకపోయారు జనం. లండను బాబు లండను బాబు ఇండియన్ డాలర్ నేను! అంటూ ఐటెమ్ పాటతోనూ లండన్ కి ప్రచారం చేశారు.

ఇంతకుముందు ప్యారిస్-బ్యాంకాక్- సింగపూర్ అంటూ మహేష్ ఫ్యామిలీ వెకేషన్ కి వెళితే అక్కడ ఎగ్జోటిక్ లొకేషన్లకు అదిరిపోయే బ్రాండింగ్ కలిసొచ్చింది. సామాజిక మాధ్యమాల ప్రచారంలో స్పీడ్ మీద ఉండే మహేష్ వల్ల ఆయా ప్రాంతాలకు కలిసొచ్చింది. శ్రీమంతుడు- భరత్ అనే నేను- మహర్షి లాంటి భారీ చిత్రాన్ని.. విదేశీ లొకేషన్లలో అద్భుతంగా తెరకెక్కించారు. దీంతో ఆయా లొకేషన్లకు చక్కని ప్రమోషన్ కుదిరింది. లొకేషన్ ఏదైనా మహేష్ ఛరిష్మాతో అది కాస్తా వైరల్ అయిపోతోంది.

ప్రస్తుతం మహేష్ కేరళలో షూటింగుల్లో పాల్గొంటున్నాడు. తాజాగా ఆన్ లొకేషన్ నుంచి అదిరిపోయే ఫోటో ఒకటి రివీలైంది. ఈ ఫోటోలో మహేష్ ఓ నది డ్యామ్ పై గళ్ల చొక్కా నల్ల ఫ్యాంటుతో అదిరిపోయే స్టైల్ లో కనిపించాడు. తనతో పాటే చిత్రబృందం ఆ ఫోటో ఫ్రేమ్ లో కనిపించింది. దర్శకనిర్మాతలు అనీల్ రావిపూడి- అనీల్ సుంకర.. సినిమాటోగ్రాఫర్ రత్నవేలు.. సంగీత దర్శకుడు దేవీశ్రీ..సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ తదితురులు ఈ ఫోటోలో ఉన్నారు. ఇక వీళ్లతో పాటే లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మొత్తానికి ఈ టీమ్ ప్రచారం వల్ల కేరళకు విస్త్రతంగా పాపులారిటీ దక్కుతోంది.

ఇక కేరళకు మహేష్ మాత్రమే కాదు మన బిగ్ స్టార్స్ అంతా బాగానే ఉచిత ప్రచారం చేస్తున్నారు. ఇంతకుముందు కేరళలోని బోట్ రేస్ ఫెస్టివల్స్ కి ఎటెండవుతూ అల్లు అర్జున్ బోలెడంత ప్రచారం తెచ్చిన సంగతి తెలిసిందే. మన బిగ్ స్టార్ల సినిమాల షూటింగులతో కేరళ టూరిజానికి ఊపు రావడం ఖాయంగా కనిపిస్తోంది. కేరళ వరదలకు సైతం మన స్టార్లు విరివిగా విరాళాలు ఇచ్చి సాయం చేశారు. ఒకరకంగా ఏపీ-తెలంగాణాల్ని మించి మనోళ్లు కేరళకే ఎక్కువ బ్రాండింగ్ చేసేస్తున్నారనే భావించాల్సి ఉంటుంది! ఇక కేరళలో కనిపిస్తున్న అచ్చం అలాంటి నదులు.. కొబ్బరి తోటలు.. పిల్ల కాలువలు మన ఏపీలో కూడా ఉన్నాయి. గోదారి జిల్లాలు.. కోనసీమ.. వైజాగ్ విజయనగరంలో ఇలాంటి లొకేషన్లు బోలెడు. అక్కడ లొకేషన్లకు బిగ్ స్టార్స్ ప్రాధాన్యతనిస్తే ఇటువైపు ప్రచారం దక్కుతుందేమో!!
Please Read Disclaimer