ఇంత జరుగుతున్నా మెగా బ్రదర్ సైలెంట్ గా ఉన్నారేంటి…?

0

మెగా బ్రదర్ నాగబాబు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వెండితెరతో పాటు అటు బుల్లితెరపై కూడా కాలు మోపి తెలుగు ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. అంతేకాకుండా యూట్యూబ్ ఛానల్ లో తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్తూ వస్తున్నారు. రాజకీయాలపైన సమకాలీన అంశాలపైనా తనదైన శైలిలో స్పందిస్తూ అప్పుడప్పడూ వివాదాస్పద వ్యాఖ్యలతో ట్వీట్లతో వార్తల్లో నిలుస్తుంటారు. ఇక ఎవరైనా మెగా ఫ్యామిలీని ఏమైనా అంటే వెంటనే తన యూట్యూబ్ ఛానెల్ ద్వారానో ట్విట్టర్ లోనో వారిపై విరుచుపడుతూ ఉండేవారు. అన్నయ్య చిరంజీవిని కానీ తమ్ముడు కళ్యాణ్ బాబుని కానీ ఎవరైనా ఒక్క మాట అన్నా నేను తట్టుకోలేను.. వెంటనే వారికి బదులు ఇవ్వడానికి రెడీగా ఉంటానని పలు సందర్భాల్లో నాగబాబు పేర్కొన్నారు కూడా. ఈ క్రమంలో ఇటీవల బాలయ్యను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఇంతకముందు మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కత్తి మహేష్ శ్రీరెడ్డి లాంటి వారి మీద డైరెక్ట్ గానే ఎటాక్ చేశారు నాగబాబు. అయితే ఇప్పుడు గత కొన్ని రోజులుగా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ వస్తున్న రామ్ గోపాల్ వర్మపై నాగబాబు స్పందించకపోవడం మెగా ఫ్యాన్స్ ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

గతంలో రామ్ గోపాల్ వర్మ అక్కుపక్షి అని తీవ్ర స్థాయిలో మెగా బ్రదర్ ఫైర్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు వర్మ ‘పవర్ స్టార్’ అనే సినిమా అనౌన్స్ చేసి PK MS NB ఒక రష్యన్ మహిళ నలుగురు పిల్లలు మరియు 8 గేదెలు నటిస్తున్నాయని చెప్పి పరోక్షంగా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసారు. అంతేకాకుండా ఫస్ట్ లుక్ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ ని పోలిన వ్యక్తిని ప్రధాన పాత్రగా పెట్టడంతో పాటు చిరంజీవిని పోలిన క్యారెక్టర్ ని కూడా ఇన్వాల్వ్ చేసాడు. ఈ క్రమంలో ‘పవర్ స్టార్’ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండి డైలీ పవన్ కళ్యాణ్ ని ఇండైరెక్ట్ గా టార్గెట్ చేస్తూ ఏదొక ట్వీట్ పెడుతూనే ఉన్నారు. ఈ సినిమా నిజ జీవితంలోని ఏ వ్యక్తిని ఉద్దేశించి తీస్తుంది కాదని.. పొలిటికల్ పార్టీ స్థాపించి ఎన్నికలలో ఓడిపోయిన ఓ స్టార్ హీరో స్టోరీ అని.. ఏ వ్యక్తికైనా దగ్గర పోలికలు ఉంటే అది యాదృచ్చికంగా జరిగింది మాత్రమేనని చెప్తూ మరింతగా రెచ్చ గొడుతున్నారు. దీంతో మెగా ఫ్యాన్స్ ఆర్జీవీ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.

అయితే మెగా బ్రదర్ నాగబాబు మాత్రం ఎందుకు రియాక్ట్ అవడం లేదని వారు ఆలోచిస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా లేరా అనుకుంటే అదీ కాదు లేదు. ఇటీవల ఏబీవీపీ వార్షికోత్సవం గురించి.. దలైలామా గురించి ట్వీట్లు పెట్టాడు. మరి ‘పవర్ స్టార్’ పై ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు అనే ప్రశ్న అభిమానులు అందరిలో మెదులుతోంది. అయితే కొంతమంది మాత్రం నిహారికి ఎంగేజ్మెంట్ ప్లాన్స్ తో బిజీగా ఉండి.. ఇలాంటి అనవసరమైన విషయాలపై రియాక్ట్ అవడం ఎందుకని వదిలేసి ఉంటాడని అభిప్రాయపడుతున్నారు. నిజానికి బాలయ్య ఇష్యూ తర్వాత నాగబాబు సైలెంట్ అయ్యారని కొంతమంది వాదన. అందుకే ఈ మధ్య వివాదాస్పద ట్వీట్స్.. వీడియోలు పోస్ట్ చేయడం లేదు అంటున్నారు. మరి ‘పవర్ స్టార్’ సినిమా త్వరలోనే రిలీజ్ చేస్తానని వర్మ ప్రకటించారు. ఈ నేపథ్యంలో సినిమా చూసిన తర్వాత మెగా బ్రదర్ రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని మెగా ఫ్యాన్స్ అనుకుంటున్నారు.