దర్బార్ .. ఎందుకీ సడెన్ ఆర్భాటం?

0

సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రమోషనల్ స్ట్రాటజీ మారిందా? మునుపటితో పోలిస్తే తలైవాలో ఏదో ఛేంజ్ కనిపిస్తోంది! ఇన్నాళ్లు కథ వేరు.. ఇక పై కథ వేరు!! అన్న తీరుగానే ఉంది ఆయన వ్యవహారం. అందుకేనా దర్బార్ ఈవెంట్ లో అంత హడావుడి చేసారు?

అసలు రజనీ సినిమా అంటేనే ప్రతిసారీ ప్రచారం ఎలా ఉంటుందో తెలిసిందే. సరిగ్గా రిలీజ్ ముందు తలైవా జస్ట్ కనిపించారా? అంటే కనిపించారు.. అన్నట్టుగానే సాగేది. ఇక చిత్రబృందం కూడా ఏదో తూతూ మంత్రంగానే మీడియా ఇంటరాక్షన్స్ నడిపించేసేవారు. బహుశా రజనీ ఏజ్ దృష్ట్యానో లేక పాన్ ఇండియా బిజీ వల్లనో ఆయన మెరుపు తీగలా కనిపించి వెళ్లిపోయేవారు. ఎంత పెద్ద సినిమా తీసినా రజనీ.. దానికి సంబంధించిన టీమ్ కొన్ని నిమిషాలు మాత్రమే తెలుగు మీడియా ముందు కనిపించే వారు. ఇక మీడియా ఇంటరాక్షన్ లు.. ఇంటర్వూలకు అసలు టైమ్ ఇచ్చేవారే కాదు. రజినీ సినిమా కు ప్రీ రిలీజ్ ఈవెంట్లు అనేది వున్నా పెద్ద హడావిడి వుండదు. అలా వచ్చామా.. ఇలా వెళ్లామా అన్నట్టుగానే వుండేవి.

కానీ `దర్బార్` విషయం లో రజనీ తో పాటు ఆ సినిమా మేకర్స్ తీరు మారినట్టే కనిపిస్తోంది. తెలుగు రిలీజ్ విషయంలోనూ కాస్త జాగ్రత్త తీసుకునే ఆలోచనలో ఉన్నట్టే. అందుకే స్ట్రెయిట్ తెలుగు సినిమా వేడుకలా శుక్రవారం `దర్బార్` ప్రీరిలీజ్ వేడుకని అట్టహాసం గానే ప్లాన్ చేశారు. రజనీ సినిమా పాటల మెడ్లీలతో ప్రోగ్రామ్ అంతా హోరెత్తించారు. రజనీ కూడా ఓ తమిళ సినిమాకు కేటాయించినంత సమయాన్ని ఇక్కడ ప్రీరిలీజ్ ఈ వెంట్ కి కేటాయించడం వెనక ఇంకేదో భయం వుందన్న గుసగుసా వినిపించింది. అయితే దానికి కారణం కూడా స్పష్టం.

రజనీ మార్కెట్ తెలుగులో పూర్తిగా డౌన్ అవ్వడమే ఈ మార్పునకు కారణమా? అంటే అవుననే భావించాల్సి ఉంటుంది. గతంలో రజనీ సినిమా రిలీజ్ అవుతోందంటే డిస్ట్రిబ్యూటర్ లు పోటాపోటీగా ఎగబడేవారు. కానీ కథానాయకుడు- కొచ్చాడయాన్-కబాలి రిజల్ట్ అనంతరం సీన్ అంతా మారి పోయింది. ఇక్కడ రజనీ మార్కెట్ పూర్తిగా డౌన్ ఫాల్ అయ్యింది. సరిగ్గా దీని ప్రభావమే దర్బార్ బిజినెస్ పైనా పడింది. రిలీజ్ దగ్గర పడుతున్నా ఎందుకనో ఈ సినిమాపై క్రేజ్ లేక పోవడం తో ప్రీరిలీజ్ తో అయినా హంగామా చేసి తెలుగు మార్కెట్ కి బూస్టప్ ఇవ్వాలని భారీగా ప్లాన్ చేశారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. శనివారం నుంచి మురుగదాస్ సహా ఇతర కీలక టీమ్ మీడియా ఇంటర్వూ లు కూడా ప్లాన్ చేయడం తో ఫిల్మ్ సర్కిల్స్ లో దీనిపై ఆసక్తికర ముచ్చట సాగుతోంది.
Please Read Disclaimer