ప్రపంచ రికార్డు దక్కినా విజయ నిర్మలకు ‘పద్మ’ రాలేదేం?

0

తెలుగులోనే కాకుండా పలు భాషల్లో నటించి దర్శకురాలిగా నిర్మాతగా సినిమా పరిశ్రమకు ఎంతో సేవ చేసిన వ్యక్తి విజయ నిర్మల. ఆమె మరణం తెలుగు సినిమా పరిశ్రమకే కాకుండా ఇండియన్ సినిమాకు కూడా లోటని చెప్పాలి. ప్రపంచంలో ఇప్పటి వరకు ఏ మహిళ దర్శకురాలు కూడా 44 సినిమాలకు దర్శకత్వం వహించింది లేదు. ఇలాంటి అద్బుతమైన రికార్డును సొంతం చేసుకున్న విజయ నిర్మల గారికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కూడా దక్కింది. నటిగా నిర్మాతగా దర్శకురాలిగా సినిమాకు ఎంతో చేసిన విజయ నిర్మల గారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి మాత్రం సరైన గుర్తింపు రాలేదని చెప్పాలి.

నిన్న మొన్న ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఎంతో మందికి కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను కట్టబెట్టింది. ఇక్కడ వారిని తక్కువ చేయడం కాదు కాని.. వారి కంటే ఎన్నో రెట్లు గొప్ప వ్యక్తి.. ఫిల్మ్ మేకర్ అయిన విజయ నిర్మల గారికి పద్మ అవార్డు రాకపోవడం సోచనీయం. పద్మ అవార్డు అందుకు ఎంతో మంది సినీ తారలతో పోల్చితే విజయ నిర్మల సినిమా పరిశ్రమలో చాలా కృషి చేశారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కాని విజయ నిర్మల గారికి మాత్రం ఏవో కారణాల వల్ల పద్మ అవార్డు దక్కలేదు.

విజయ నిర్మల తరపున పలుసార్లు పద్మ అవార్డుకు దరఖాస్తు వెళ్లింది. ప్రతి సారి కూడా ఆమె కుటుంబ సభ్యులు మరియు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూశారు. కాని అన్ని సార్లు కూడా వారికి నిరాశే మిగిలింది. విజయ నిర్మల గారికి పద్మ అవార్డు రాకపోవడంకు ప్రాంతం.. రాజకీయం.. వ్యక్తిగత విషయాలతో పాటు ఇతరత్ర కారణాలు సాకుగా కొందరు చెబుతున్నారు. కాని ఆమె ప్రతిభ.. ఆమె ఇండస్ట్రీకి చేసిన సేవ ముందు అవేమి కూడా పెద్ద లెక్కలోకి రావు. ప్రతిసారి పద్మ అవార్డుల ఎంపికలో విమర్శలు ఎదుర్కొంటున్న కేంద్ర ప్రభుత్వం విజయ నిర్మల కు అవార్డు ఇవ్వక పోవడం ఖచ్చితంగా వారి నిజాయితీని అనుమానించాల్సిందే అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సినిమా పరిశ్రమకు చెందిన అవార్డులు కూడా విజయ నిర్మాల గారికి ఎక్కువ రాలేదు. అందుకు కూడా రాజకీయాలు కారణం అయ్యి ఉంటాయని కొందరి ఆరోపణ.

మొత్తానికి పద్మ అవార్డుతో పాటు మరే ఇతర ప్రముఖ అవార్డులు రాకున్నా కూడా అంతకు మించిన ప్రేక్షకుల ఆధరాభిమానాలను ఆమె సొంతం చేసుకున్నారు. ఆమె మరణంతో ఎంతో మంది గుండెలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంత మంది అభిమానం దక్కించుకోవడం కంటే మించిన అవార్డులు ఏముంటాయి చెప్పండి. విజయ నిర్మల గారు కూడా అదే అనుకున్నారేమో ఎప్పుడు కూడా తనకు అవార్డులు రాలేదనే విషయాన్ని బాహాటంగా మాట్లాడలేదు. అవార్డులు వచ్చిన రాకున్నా తన మంచి మనసుతో నలుగురికి సాయం చేశారు విజయ నిర్మల. ఆమె ఆత్మకు శాంతి కలగాలని అంతా కోరుకుందాం.