తలైవా ఇంతలోనే ఎంత మార్పు?

0

సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయారంగేట్రం ఆల్ టైమ్ హాట్ టాపిక్. సౌత్ స్టార్ హీరోగా చెక్కు చెదరని ఇమేజ్ ఉన్న ఆయనలోని అంతర్మధనం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా అసాధారణ మాస్ ఫాలోయింగ్ తో నేటికీ అభిమానుల జేజేలు అందుకుంటున్న రజనీ లైఫ్ లో పొలిటికల్ ఎంట్రీ కీలక మలుపు. దశాబ్ద కాలంగా రజనీ రాజకీయ అరంగేట్రంపై దేశవ్యాప్తంగా చర్చ సాగుతూనే ఉంది. ఆయన అభిమానుల ఒత్తిడి ఉన్నా ఎంతో వేచి చూశాకే చివరికి రజనీ రాజకీయ అరంగేట్రం చేసి గత ఎన్నికలకు ముందు పార్టీ పేరును కూడా ప్రకటించారు. అయితే రజనీ రాజకీయాల్లోకి వచ్చి ఏదో చేస్తారనుకుంటే ఇంకేదో అవుతోందన్న ఆవేదన అభిమానుల్లో బయటపడుతోంది. ఆయన పక్కా పొలిటికల్ లీడర్ లా వ్యవహరించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రజనీ వ్యవహారశైలి అభిమానులకు కూడా అసహనాన్ని తెప్పిస్తోందని తమిళ మీడియాలో కథనాలొచ్చాయి. పొలిటికల్ లీడర్ అంటే అన్నింటిపైనా స్పందించాలి. అందరినీ అక్కున చేర్చుకోవాలి. ఎవరిని హెచ్చరించాలో వారిని హెచ్చరించాలి. ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలి. ఎక్కడ నెగ్గాలో అక్కడ నెగ్గుకురావాలి. ఇవన్నీ తెలియకపోతే రాజకీయాల్లో కుదరదు. రజనీ వ్యవహార శైలి నచ్చని కొంత మంది ఇటీవల ఇలాంటి విమర్శలే చేశారు. దానికి ఫ్యాన్స్ రియాక్ట్ అయినా రజనీ మాత్రం రియాక్ట్ కాలేదు. దీంతో అభిమానుల్లో మరింత అనుమానం మొదలైంది. ఇంతకీ రజనీ రాజకీయాల్లో ఉన్నట్టా లేనట్టా అనే అనుమానాలు మొదలయ్యాయి.

అయితే అభిమానుల అనుమానాలు రజనీలోనూ సందేహం రేకెత్తిస్తున్నాయని నెమ్మదిగా అర్థమవుతోంది. అందుకే ఆయన తన రూటు మారుస్తున్నారు. అన్ని అనుమానాల్ని పటాపంచలు చేస్తూ రజనీ తనదైన శైలిలో తమిళ ప్రజల సమస్యలపై సూటిగా స్పందించడం మొదలు పెట్టారు. జాతీయ విద్యా విధానంపై ప్రస్తుతం సర్వత్రా ఆసక్తికర చర్చ సాగుతున్న వేళ .. హీరో సూర్య ఘాటైన విమర్శలు చేయడం ఇటీవల సంచలనంగా మారింది. దీనిపై కొందరు నాయకులు సూర్యపై విమర్శలు కురిపించారు. అయితే మొన్న కప్పాన్ వేదికపై రజనీ మాట్లాడుతూ.. సూర్యకు అలా ప్రశ్నించే అర్హత వుందని బాహాటంగా స్టేట్ మెంట్ ఇవ్వడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. వివాదాలకు విమర్శలకు దూరంగా వుండే రజనీ ఇలా సూటిగా విమర్శలు చేయడంతో పలువురిలో ఆలోచన రేకెత్తిస్తోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ మారిపోయారే.. రాజకీయ రణరంగానికి తలైవా సిద్ధమవుతున్నారనే సంకేతమా? అంటూ అందరిలో ఉత్సాహం మొదలైంది. రజనీ అడుగులు కూడా అందుకు అనుగుణంగానే పడుతుండటంతో అభిమానుల్లో నూతనోత్సాహం ఉరకలేస్తోంది.
Please Read Disclaimer