చరణ్ కు శివసామి పాత్ర సెట్ అయ్యేనా?

0

ధనుష్ హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో కళ్లైపులి ఎస్ థాను నిర్మించిన ‘అసురన్’ చిత్రం ఈనెల 4న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ధనుష్ కెరీర్ లో రికార్డు స్థాయి గ్రాసర్ గా నిలవడంతో పాటు మరోసారి ఈ చిత్రంతో ధనుష్ విమర్శల ప్రశంసలు దక్కించుకున్నాడు. అసురన్ చిత్రం 100 కోట్లు క్రాస్ చేసి ఇంకా కొనసాగుతూనే ఉంది. బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ నుండి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వరకు అంతా కూడా అసురన్ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

అసురన్ చిత్రంలో హీరో పాత్ర చాలా విభిన్నంగా ఉంటుంది. నటనకు ఆస్కారం ఉన్న పాత్ర అవ్వడంతో ఈ చిత్రాన్ని మెగా హీరో రామ్ చరణ్ రీమేక్ చేయాలని ఆశ పడుతున్నాడట. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేసి చేస్తే తప్పకుండా టాలీవుడ్ ప్రేక్షకులకు ఈ చిత్రం నచ్చుతుందనే నమ్మకంతో మెగా కాంపౌండ్ రీమేక్ రైట్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

తమిళ సినిమాలు చాలా రియలిస్టిక్ గా ఉంటాయి. అసురన్ చిత్రం కూడా చాలా రియలిస్టిక్ గా ఉంది. సినిమాలో ధనుష్ పోషించిన శివసామి పాత్రను తెలుగు హీరోలు చేస్తే ఆధరించడం కష్టమే. ఎందుకంటే మరీ అంత రియలిస్టిక్ ను తెలుగు ప్రేక్షకులు స్వీకరించరు. ఆ విషయం గతంలోనే పలు సార్లు నిరూపితం అయ్యింది. అయితే అసురన్ మెయిన్ స్టోరీ లైన్ తీసుకుని శివసామి పాత్రను మార్చి తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా డిజైన్ చేస్తే తప్పకుండా మంచి ఫలితం ఉంటుందనిపిస్తుంది.

మరి నిజంగానే చరణ్ ‘అసురన్’ రీమేక్పై ఆసక్తి చూపిస్తున్నాడా లేదా అనేది మెగా కాంపౌండ్ నుండి అధికారిక ప్రకటన వస్తే కాని తెలియదు. ప్రస్తుతం చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో నటిస్తున్నాడు. ఆ తర్వాత తండ్రితో కలిసి ఒక మల్టీస్టారర్ చిత్రం చేస్తాడని ప్రచారం జరుగుతోంది. మరి అసురన్ రీమేక్ చేయాలనుకుంటే ఎప్పుడు చేస్తాడో చూడాలి.