ఓడినా మంత్రి పదవి ఇస్తే.. హ్యాండివ్వబోతున్నాడట

0

సార్వత్రిక ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత తెలుగుదేశం పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి. ఆ పార్టీకి భవిష్యత్ ఉండదన్న భయమో.. మరే కారణమో గానీ టీడీపీకి చెందిన కీలక నేతలంతా పక్క పార్టీల వైపు చూస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులతో పాటు కీలక నేతలు కొందరు సైకిల్ దిగిపోయి భారతీయ జనతా పార్టీలో చేరిపోయారు. మరికొందరు నేతలు కూడా ఆ పార్టీ వైపు చూస్తున్నారు. బీజేపీ కూడా వచ్చే ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే మరొకరికి గాలం వేసిందట.

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంగా కొనసాగినా చంద్రబాబుకు అండగా నిలిచిన వ్యక్తుల్లో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఒకరు. చంద్రబాబుపై ఎవరైనా విమర్శలు చేస్తే ఠక్కున మీడియా ముందుకు వచ్చేస్తుంటారు. అవతల ఉన్నది ఎంతటి వారైనా అస్సలు ఊరుకునే వారు కాదు. అందుకే పార్టీలో చంద్రబాబు కూడా ఆయనకు ప్రాధాన్యత ఇచ్చేవారు. ఈ క్రమంలోనే ఎన్నో పదవులను సైతం ఆయనకు కట్టబెట్టారు. ఇప్పుడు ఈయనను తమ పార్టీలో చేర్చుకునేందుకు భారతీయ జనతా పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.

తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా కొనసాగుతున్న మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై బీజేపీ నేతలు కన్నేశారని తెలిసింది. చంద్రబాబుకు అత్యంత ఆప్తుడిగా చెప్పుకునే ఆయనను భారతీయ జనతా పార్టీలో చేర్చుకునేందుకు ఆ పార్టీ నేతలు ఉవ్విళ్లూరుతున్నారని సమాచారం. ఈ మేరకు కాషాయదళం ఇప్పటికే ఆయనతో మంతనాలు కూడా జరిపిందని ప్రచారం జరుగుతోంది. ఆ పార్టీలో చేరేందుకు సోమిరెడ్డి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారనే టాక్ వినిపిస్తోంది. ఆయన త్వరలోనే కాషాయ కండువా కప్పుకోబోతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

వాస్తవానికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై చంద్రబాబుకు ఎంతో నమ్మకం ఉంది. అందుకే ఆయన వరుసగా మూడు సార్లు ఓడిపోయినా ఎమ్మెల్సీ ఇచ్చి మరీ 2014లో మంత్రి పదవి ఇచ్చారు. అది కూడా కీలకమైన శాఖనే కట్టబెట్టారు. అయితే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎమ్మెల్సీకి రాజీనామా చేసిన ఆయన.. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాకాని గోవర్ధన్ రెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. ఇక అప్పటి నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సైలెంట్ గానే ఉంటున్నారు.