హిట్టుకి `బందోబస్త్` దారి చూపుతుందా?

0

ట్యాలెంటెడ్ హీరో సూర్య హిట్టు అనే మాట విని దాదాపు ఆరేళ్లవుతోంది. `సింగం-2` తరువాత సన్నివేశమిది. ఆ సినిమా తరువాత చేసిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాయి. ఒక దశలో విభిన్నమైన చిత్రాలతో వరుస విజయాల్ని సొంతం చేసుకున్న సూర్య గత కొంత కాలంగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఎన్ని ప్రయోగాలు చేసినా ఫలించడం లేదు. తానే నిర్మాతగా మారి విక్రమ్ కె. కుమార్‌తో `24` వంటి ప్రయోగాత్మక చిత్రాన్ని నిర్మించినా ఫలితం దక్కలేదు. తనకు అచ్చొచ్చిన పోలీస్ పాత్ర కూడా సూర్యను పరాజయాల నుంచి కాపాడలేకపోయింది. `స్పెషల్ 26`ని రీమేక్ చేసినా అదీ అంతంత మాత్రమే.

ఏరికోరి సెల్వరాఘవన్ దర్శకత్వంలో నటించిన `ఎన్ జీకే` కూడా సూర్యకు చేదు జ్ఞాపకాల్నే మిగిల్చింది. క్రేజీ కాంబినేషన్ వున్నా సినిమాలో బలమైన కథ లేకపోవడంతో ఎన్నో ఆశలు పెట్టుకున్న `ఎన్ జీకే` బాక్సీఫీస్ వద్ద దారుణ ఫలితాన్ని ఎదుర్కొంది. దీంతో ఆలోచనలో పడ్డ సూర్య తనకు హిట్ చిత్రాన్ని ఇచ్చిన కె.వీ. ఆనంద్ ని నమ్ముకుని మరో ప్రయోగానికి సిద్ధమయ్యారు. సూర్య నటిస్తున్న తాజా చిత్రం `కప్పాన్`. సూర్యతో వీడొక్కడే బ్రదర్స్ వంటి ప్రయోగాత్మక చిత్రాలు రూపొందించిన కె.వి.ఆనంద్. తనతో కలిసి చేస్తున్న మూడవ చిత్రమిది. ఈ సినిమా సూర్య కెరీర్‌కు అత్యంత కీలకంగా మారింది. ఈ చిత్రాన్ని తెలుగులో `బందోబస్త్` పేరుతో విడుదల చేస్తున్నారు. `2.ఓ` వంటి ప్రతిష్టాత్మక చిత్రాన్ని అందించిన లైకా ప్రొడక్షన్స్ సంస్థ రెండు భాషల్లోనూ విడుదల చేస్తోంది.

ఈ భారీ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ ప్రధాన మంత్రిగా నటిస్తున్నారు. ఆయనకు బందోబస్త్ అందించే టీమ్‌కు ప్రధాన అధికారిగా సూర్య ఎన్ ఎస్ జీ కమెండోగా కనిపించబోతున్నారు. సాంకేతికంగా అత్యున్నత స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో ఎలాగైనా భారీ విజయాన్ని సొంతం చేసుకోవాలని సూర్య ఆశిస్తున్నారు. మరి అతని ఆశల్ని దర్శకుడు కె.వి.ఆనంద్ ఎంత వరకు ఫుల్ ఫిల్ చేస్తాడన్నది తెలియాలంటే ఆగస్టు 30 రిలీజ్ వరకు వేచి చూడక తప్పదు.