బొమ్మాళీ మళ్ళీ బ్రేక్ తీసుకోనుందా..?

0

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క ‘అరుంధతి’ ‘బాహుబలి’ ‘రుద్రమదేవి’ ‘భాగమతి’ వంటి సినిమాలతో తిరుగులేని క్రేజ్ ను సంపాదించుకుంది. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఆచితూచి అడుగులు వేస్తూ వస్తున్న ఈ బొమ్మాళీ.. ‘నిశ్శబ్దం’ రిజల్ట్ తర్వాత ఆలోచనలో పడిందట. అనుష్క లీడ్ రోల్ లో నటించిన ‘నిశ్శబ్దం’ సినిమా ఇటీవలే తెలుగు తమిళ మలయాళ భాషల్లో ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకుల నుంచి సినీ విశ్లేషకుల నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. కాకపోతే చెవుడు మూగ యువతి పాత్రలో అనుష్క నటన అందరిని ఆకట్టుకుంది. అంతేకాకుండా ‘నిశబ్దం’ సినిమాకి అమెజాన్ ప్రైమ్ లో వ్యూస్ కూడా బాగానే వచ్చాయని తెలుస్తోంది. అయినప్పటికీ అనుష్క కెరీర్ ఏ మాత్రం ముందుకు వెళ్లడం లేదనే టాక్ వినిపిస్తోంది.

‘నిశబ్దం’ సినిమా షూటింగ్ సమయంలో అనుష్క ఓ డెబ్యూ డైరెక్టర్ తో వర్క్ చేయనున్నట్లు.. యూవీ క్రియేషన్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతానికి అనుష్క ఈ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టిందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అలానే దక్షిణాది స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ తెరకెక్కించబోయే ఓ సినిమాలో అనుష్క హీరోయిన్ గా నటించనుందని అప్పట్లో అనుకున్నారు. అయితే ఆ ప్రాజెక్ట్ గురించి ఇంతవరకు ఎలాంటి అప్ డేట్ లేదు. అసలు ఈ సినిమా ఉందో లేదో కూడా తెలీయని పరిస్థితి ఉంది. మరోవైపు సీనియర్ హీరోయిన్లందరూ సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. అనుష్క మాత్రం ‘నిశ్శబ్దం’ తర్వాత మరో సినిమా ప్రకటించలేదు. ‘భాగమతి’ సినిమా తర్వాత బ్రేక్ తీసుకున్నట్లే బహుశా ఈ బొమ్మాళీ మళ్లీ బ్రేక్ తీసుకుంటేదేమో అని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది.