ఈసారైనా త్రివిక్రమ్ రూటు మారుస్తారా?

0

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ‘అల వైకుంఠపురములో’ సినిమాతో భారీ హిట్ సాధించారు. ‘అజ్ఞాతవాసి’ సినిమా ఫలితం తర్వాత గురూజీ ఫామ్ పై అందరికీ సందేహాలు తలెత్తాయి కానీ ‘అరవింద సమేత’ తో ఓకే అనిపించుకున్నారు. ఇక ‘అల వైకుంఠపురములో’ సినిమాతో మరోసారి తనో టాప్ లీగ్ స్టార్ డైరెక్టర్ అని ఋజువు చేశారు. దీంతో త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమాలపై కూడా ఆసక్తి రెట్టింపయింది. అయితే కొందరు మాత్రం త్రివిక్రమ్ ను నెక్స్ట్ చేయబోయే సినిమాలు ఆయనకు ఒక టెస్ట్ కాబోతున్నాయి అంటున్నారు.

త్రివిక్రమ్ సినిమాలన్నీ ఒక మూసలో ఉన్నాయనేది ప్రధానమైన కంప్లైంట్. ‘అత్తారింటికి దారేది’.. ‘S/o సత్యమూర్తి’.. ‘అజ్ఞాతవాసి’.. ‘అల వైకుంఠపురములో’ ఈ సినిమా కథలన్నీ ఇంచుమించు ఒకేరకంగా ఉంటాయి. నాన్న-కొడుకు.. ఒక పెద్ద ఇల్లు ఆ ఇంట్లో వ్యక్తుల మధ్య జరిగే సంఘర్షణ. ఇంట్లోనుంచి బయటకు రావడం లేదా లోపలికి వెళ్లడం ఇదే కామన్ పాయింట్. ఇక ‘అల వైకుంఠపురములో’ గురించి మాట్లాడుకుంటే సినిమా సూపర్ డూపర్ హిట్.. భారీ కలెక్షన్స్ సాధించింది కానీ ఈ సినిమాపై విమర్శలు కూడా ఉన్నాయి. ఈ సినిమాకు ‘నాన్నారింటికి దారేది’ అనే టైటిల్ ఉండాల్సిందని ఒక కామెంట్ వినిపించింది. నిజానికి కథ.. ఎమోషన్స్ విషయంలో ఈ సినిమా కు ‘అత్తారింటికి దారేది’ స్థాయి లేదని చాలామంది అభిప్రాయం. ‘అల వైకుంఠపురములో’ సినిమాకు పాటలు అద్భుతం గా ఉండడం.. సంక్రాంతి సీజన్ కలిసి రావడంతో ఆ రేంజ్ వచ్చింది కానీ ‘అత్తారింటికి దారేది’ సినిమా తో పోల్చలేమని అంటున్నారు.

త్రివిక్రమ్ రెగ్యులర్ గా చేసే స్టోరీలనే అటూ ఇటూ మార్చి తీసిన సినిమా ‘అల వైకుంఠపురములో’ అనే అభిప్రాయం ఉంది. ఇక ఈ సినిమాలోని డైలాగ్స్ లో త్రివిక్రమ్ మునుపటి స్థాయి లేదని అంటున్నారు. ఇదిలా ఉంటే త్రివిక్రమ్ తన నెక్స్ట్ సినిమా కు ఎలాంటి కథ ఎంచుకుంటారనేది ఆసక్తికరం. ఒక పెద్ద ఇల్లు.. హీరో ఆ ఇంట్లోకి అడుగుపెట్టడం లాంటి కాన్సెప్ట్ మరోసారి రిపీట్ చేస్తే వర్క్ అవుట్ అయ్యే పరిస్థితి ఉండదనే అభిప్రాయం వినిపిస్తోంది. ఈసారి కూడా చెల్లి ఇంటికి దారేది.. మామ బంగళాకి దారేది.. అల్లుడు కంపెనీ రూటేది లాంటివే చేస్తారా లేదా కొత్త కథను ఎంచుకుంటారా అనేది వేచి చూడాలి.
Please Read Disclaimer