సంక్రాంతి బరిలో నిలిచేది కుర్ర హీరోలే…!

0

సంక్రాంతి పండుగ అంటే ‘సినిమా పండుగ’. థియేటర్స్ అన్నీ కొత్త సినిమాలతో కళ కళలాడుతుంటాయి. ప్రతి ఏడాది ఓ అరజడను సినిమాలు థియేటర్స్ లో సందడి చేస్తుంటాయి. ఫెస్టివల్ సీజన్ లో తమ సినిమాలని రిలీజ్ చేసుకోవాలని ప్రతీ హీరో దర్శక నిర్మాత కోరుకుంటారు. ఎందుకంటే ఈ సీజన్ లో బాక్సాఫీస్ కలెక్షన్స్ ఓ రేంజ్ లో ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ సినిమా కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా వసూళ్ల పరంగా మంచి సినిమాగా నిలుస్తుంది. అందుకే పోటీపడి మరీ సంక్రాంతికి సినిమాలను వచ్చేలా ప్లాన్ చేసుకుంటారు. ఇక ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన సినిమాలలో మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. దీంతో నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి తీవ్రమైన పోటీ ఏర్పడింది.

కాగా అందరి కంటే ముందుగా 2021 సంక్రాంతి కోసం జక్కన్న ‘ఆర్.ఆర్.ఆర్’ కర్చీఫ్ వేసేశాడు. అయితే కరోనా కారణంగా అది సాధ్యపడటం లేదు. అంతేకాకుండా ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ స్టార్ట్ అయితే మరో ఆరు నెలలు సమయం తీసుకుంటుందని క్లారిటీ ఇచ్చేసాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’.. ప్రభాస్ ‘రాధే శ్యామ్’ సినిమాలు అప్పటి వరకు కంప్లీట్ అయ్యే అవకాశాలు లేవు. రిలీజ్ కి రెడీగా ఉన్న కొన్ని క్రేజీ మూవీస్ ఆల్రెడీ ఓటీటీ బాట పట్టాయి. దీంతో ఈసారి సంక్రాంతి బరిలో అందరూ యువ హీరోలు నిలిచే అవకాశం ఉంది. ఇప్పటికే దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాలన్నీ సంక్రాంతి కే రానున్నాయి.

‘ఇస్మార్ట్ శంకర్’ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న రామ్ పోతినేని ‘రెడ్’ అనే సినిమాని లైన్లో పెట్టాడు. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ సినిమా థియేటర్స్ క్లోజ్ అవడంతో వాయిదా పడింది. అయితే ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేయబోమని.. ఎన్ని రోజులైనా వెయిట్ చేసి థియేటర్స్ లోనే విడుదల చేస్తామని మేకర్స్ హింట్ ఇచ్చారు. దీంతో రామ్ ‘రెడ్’ సంక్రాంతి బరిలో నిలవనుందని అర్థం అయింది. ఇక అక్కినేని అఖిల్ నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాని 2021 సంక్రాంతికి తీసుకురాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి మార్కెట్ ని టార్గెట్ చేస్తోంది.

నితిన్ – కీర్తి సురేష్ కాంబినేషన్ లో రూపొందుతున్న ‘రంగ్ దే’ చిత్రాన్ని అన్నీ అనుకున్నట్లు జరిగితే పెద్ద పండక్కే తీసుకొస్తామని నిర్మాతలు ప్రకటించారు. యువ హీరో శర్వానంద్ కూడా సంక్రాంతి బరిలో దిగడానికి రెడీ అయ్యాడు. ప్రస్తుతం శర్వా నటిస్తున్న ‘శ్రీకారం’ సినిమాని సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే రెండుసార్లు పెద్ద హీరోలతో పోటీపడి సంక్రాంతి విన్నర్ అనిపించుకున్న శర్వా మరోసారి ఫెస్టివల్ ని టార్గెట్ చేశాడు. ఇక మెగా హీరో సాయి ధరమ్ తేజ్ – ‘ప్రస్థానం’ దేవా కట్ట కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాని పండుగ సీజన్ కే తీసుకురావాలని మేకర్స్ ఆలోచిస్తున్నారట. అయితే పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమా రిలీజ్ పై క్లారిటీ లేదు. ఒకవేళ ‘వకీల్ సాబ్’ ని డైరెక్ట్ ఓటీటీ మెట్లు ఎక్కించకపోతే ఈ కుర్ర హీరోలతో పాటు పవన్ కళ్యాణ్ కూడా సంక్రాంతి రేసులో నిలిచే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కరోనా పరిస్థితులను బట్టి రాబోయే రోజుల్లో ఈ సినిమాలపై మరింత క్లారిటీ రానుంది.