కొండ హీరోల కొత్త రూటు

0

ఇప్పుడు టాలీవుడ్ లో ముగ్గురు కొండ యూత్ హీరోలు ఉన్నారు. అంటే సైజులో కాదు లెండి. ఇంటిపేరులో కొండ ఉన్నవాళ్లన్నమాట. విజయ్ దేవరకొండ – సాయి శ్రీనివాస్ బెల్లంకొండ – కార్తికేయ గుమ్మకొండ ఇలా మొత్తం ముగ్గురు టాలీవుడ్ లో బలంగా పాగా వేసేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ముందుగా విజయ్ దేవరకొండ సంగతి చూసుకుంటే అర్జున్ రెడ్డితో ఇమేజ్ ని గీత గోవిందంతో మార్కెట్ ని సంపాదించుకున్న ఈ యూత్ ఐకాన్ కు భారీ ఫాన్ ఫాలోయింగ్ ఉంది.

కాని తనను అభిమానులు ఒకే తరహలో అగ్రెసివ్ క్యారెక్టరైజేషన్ లో చూడాలనుకుంటున్నారని లెక్కలు వేస్తున్న ఇతను సబ్జెక్టు సెలక్షన్ లో వాటికే ప్రాధాన్యం ఇవ్వడం కొంత వరకు బాలన్స్ తప్పుతోంది. అందుకే డియర్ కామ్రేడ్ లాంటి మంచి లైన్ సైతం ప్రేక్షకులు మెప్పించేలా రూపొందలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలోనో లేక బయట సర్కిల్స్ తనను ఫ్యూచర్ స్టార్ అంటున్న మాటలను పట్టించుకోకుండా స్క్రిప్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాల్సిన అవసరం అయితే చాలా ఉంది

ఇక కమర్షియల్ సినిమాలతో మాస్ హీరో సెటిలవ్వాలని చాలా ప్రయత్నించిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మొదటి సారి రాక్షసుడు రూపంలో పాజిటివ్ టాక్ అందుకోవడం కొంత రిలీఫ్ ని కలిగిస్తోంది. ఒకరకంగా చెప్పాలంటే ఇలా రూట్ మార్చి ప్రయోగాలు చేస్తే ఇలాంటి ఫలితాలు ఇంకా అందుకోవచ్చు. కాకపోతే మాస్ హ్యాంగ్ ఓవర్ తగ్గించుకుంటే బెటర్.

ఆరెక్స్ 100తో భగ్నప్రేమికుడి ఇమేజ్ తెచ్చుకున్న కార్తీకేయ గుమ్మకొండ గుణ 369తో మాస్ బాట పట్టే ప్రయత్నం చేయడం గమనార్హం. డివైడ్ టాక్ ఉన్నప్పటికీ ఇందులో ఉన్న మాస్ అంశాలతో ఎమోషనల్ కంటెంట్ కాపాడుతుందనే నమ్మకం యూనిట్ లో కనిపిస్తోంది. మొత్తంగా చూసుకుంటే విజయ్ స్టార్ స్టేటస్ వైపు సాయి శ్రీనివాస్ డిఫరెంట్ జానర్స్ వైపు కార్తికేయ మాస్ వైపు తమ టార్గెట్ లను షిఫ్ట్ చేయడం విచిత్రమే.
Please Read Disclaimer