ఫ్రెంచ్ కిస్ తో తస్మాత్ జాగ్రత్త!!!

0

గనేరియా పేరు వినే ఉంటారు కదా.. మనుషులకు సోకే బోలెడు సుఖవ్యాధులలో గనేరియా ఒకటి. అనారోగ్యకరమైన లైంగిక సంబంధాలవల్ల ఈవ్యాధి వస్తుందని సాధారణ భాషల చెప్పుకోవచ్చు. వైద్య పరిభాషలో చెప్పుకోవాలంటే గనేరియా సోకడానికి ప్రధాన కారణం నీసేరియా గనోకాకస్ అనే బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా ముఖ్యంగా జననాంగాల నుండి ద్రవించే స్రవాలలో ఉంటుంది. సెక్సువల్లీ ట్రాన్స్ మిటెడ్ ఇన్ఫెక్షన్స్ లో ఒకటి అయిన ఈ గనేరియా సెక్స్ ద్వారా వ్యాపిస్తుంది. అయితే ఇప్పటివరకూ సాధారణ సెక్స్ తో పాటు ఓరల్ సెక్స్ ద్వారా మాత్రమే ఈ వ్యాధి సంక్రమిస్తుందనే అభిప్రాయం ఉండేది. కానీ ఆస్ట్రేలియాలోని మోనాష్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో ఫ్రెంచ్ కిస్ ద్వారా కూడా ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉందనే విషయం వెల్లడైంది.

ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది 78 మిలియన్ల మందికి గనేరియా సంక్రమిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గతంలో పోలిస్తే గనేరియా కేసులు పెరుగుతూ ఉన్నాయట. దీనికి కారణం ఏంటన్న దిశగా శాస్త్రవేత్తలు పరిశోధన చేశారట. మార్చ్ 2016 నుండి.. 12 నెలల పాటు 3600 మందిపై ఈ పరిశోధన జరిగిందట. అయితే వారిలో చాలామంది కొన్ని నెలల పాటు సెక్స్ కు దూరంగా ఉన్నారట. ఈ విషయన్ని లోతుగా పరిశీలించిన మీదట గాఢమైన అధరచుంబనంతో కూడా ఈ వ్యాధి వ్యాపిస్తుందనే విషయం వెల్లడైందట. దీనికి నివారణగా సేఫ్ సెక్స్ తో పాటుగా యాంటి బ్యాక్టీరియల్ మౌత్ వాష్ లాంటివి వాడడం అలవాటు చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

శనివారం నాడు మాకు ఈ గనేరియా గోల ఎందుకు అని మీరు చిరాకు పడినా పరాకు ప్రదర్శించినా చెప్పక తప్పదు. అసలు గనేరియా లక్షణాలు మీకు తెలుసా? గనేరియా సంక్రమించిన తర్వాత 2 రోజుల నుండి 14 రోజుల లోపు లక్షణాలు కనిపిస్తాయట. అయితే కొందరు ఘనులకు మాత్రం గనేరియా లక్షణాలు అసలు కనిపించనే కనిపించవట కానీ వీరి వల్ల ఇతరలుకు మాత్రం భేషుగ్గా గనేరియా సంక్రమిస్తుందట.

గనేరియా లక్షణాలు:

*మూత్ర విసర్జనకు తరచుగా వెళ్ళాల్సిరావడం.. మూత్రం విసర్జన సమయంలో నెప్పి ఉండే అవకాకాశం కూడా ఉంటుందట.

*జనాంగాలలో వాపు.. ఎరుపు రంగులోకి మారడం. మగవారిలో వృషణాల వాపు లేదా నెప్పి. ఈ నెప్పి మలద్వారం వరకూ విస్తరించే అవకాశం ఉంటుందట.

*గొంతులో నసగా ఉండడం.

*పొత్తికడుపులో నెప్పిగా కూడా ఉంటుందట.

*మహిళలకు సోకినప్పుడు జ్వరం వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి.

గమనిక: గనేరియా ఉన్నవారితో ఫ్రెంచ్ కిస్ చేస్తే మీ ఒళ్ళు గుల్ల కావడం ఖాయం కానీ. ఆ జబ్బులేనివారితో ఇబ్బందేమీ లేదు.. మీ స్టైల్లో మీరు రెచ్చిపోవచ్చు!