తెలుగు చిత్ర పరిశ్రమలో మంచు మోహన్ బాబు కి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ప్రొడ్యూసర్ గా హీరోగా విలన్ గా ప్రతినాయకుడిగా హాస్యనటుడిగా ఎన్నో విలక్షమైన చిత్రాలు ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి టాలీవుడ్ ప్రేక్షకుల్లో ‘కలెక్షన్ కింగ్’ గా.. ‘డైలాగ్ కింగ్’ గా గుర్తుండిపోయారు. ఇక ఆయన నటవారసత్వంతో మంచు విష్ణు – మంచు మనోజ్ – మంచు లక్ష్మి ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. అయితే కెరీర్ స్టార్టింగ్ లో హీరోలుగా రాణించిన విష్ణు – మనోజ్ లు రేస్ లో వెనుకబడిపోయారు అనే కామెంట్స్ వినిపిస్తుంటాయి. బ్యాక్ గ్రౌండ్ ఉండటం వలన ఇంకా ఇండస్ట్రీలో ఉన్నారంటూ సోషల్ మీడియాలో డైరెక్ట్ గా వారిని ట్యాగ్ చేస్తూనే నెటిజన్స్ కామెంట్స్ చేస్తుంటారు. అయితే నిజానికి మంచు హీరోలు సినిమా కోసం చాలా కష్టపడతారని ఇండస్ట్రీలో చెప్పుకుంటారు. సినిమాకి సంబంధించి అన్ని క్రాఫ్ట్స్ మీద అవగాహన ఉండి సెలెక్టివ్ గా మూవీస్ చేసుకుంటూ వెళ్తారని.. కాకపోతే అదృష్టం కలిసి రావడం లేదని అంటుంటారు. ప్రస్తుతం చెరొక ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న మంచు హీరోలు ఇప్పుడు వెబ్ వరల్డ్ లో సత్తా చాటాలని చూస్తున్నారని తెలుస్తోంది.
మంచు విష్ణు ప్రస్తుతం ‘మోసగాళ్లు’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ప్రపంచలోనే బిగ్గెస్ట్ ఐటీ స్కామ్ నేపథ్యంలో వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని విష్ణు హోమ్ బ్యానర్ లో నిర్మిస్తున్నాడు. ఈ క్రమంలో విష్ణు స్వీయ నిర్మాణంలో ఓ వెబ్ సిరీస్ లో నటించడానికి ప్లాన్స్ చేసుకుంటున్నాడని సమాచారం. ఇప్పటికే ప్రొడ్యూసర్ గా శ్రీకాంత్ తో ‘చందరంగం’ అనే వెబ్ సిరీస్ నిర్మించిన సంగతి తెలిసిందే. మరోవైపు మంచు లక్ష్మి ఆల్రెడీ వెబ్ వరల్డ్ లో అడుగుపెట్టి ‘సుబ్బలక్ష్మి’ అనే సిరీస్ లో నటించింది. మరోవైపు టాలెంటెడ్ హీరో మంచు మనోజ్ దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ఆయన మళ్ళీ ”అహం బ్రహ్మాస్మి” అనే సినిమాతో రాబోతున్నాడు. పాన్ ఇండియా మూవీగా తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. మరి మంచు హీరోలు వెబ్ వరల్డ్ లో సత్తా చాటి సరైన ఫామ్ లో వస్తారేమో చూడాలి.
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసులో అతని గర్ల్ ఫ్రెండ్ హీరోయిన్ రియా చక్రవర్తి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇటీవల డ్రగ్స్ వ్యవహారం బయటకు రావడంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు విచారణ ప్రారంభించి పలువురిని అరెస్ట్ చేశారు. ఇక డ్రగ్స్ కేసులో ఇవాళ రియా చక్రవర్తి ఎన్సీబీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. అయితే ఎన్సీబీ విచారణకు వచ్చిన రియాను మీడియా ప్రతినిధులు ఒక్కసారిగా చుట్టుముట్టడంతో ఆమె ఇబ్బందికి గురయ్యారు. కనీసం ముందుకు కదలలేని పరిస్థితుల్లో కన్నీళ్లు కూడా పెట్టుకుంది. ఈ ఘటనపై మంచు లక్ష్మి తీవ్రంగా స్పందించారు. ఓ స్త్రీ పట్ల ఇంత దారుణంగా వ్యవహరిస్తారా అంటూ ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు.
కాగా మంచు లక్ష్మి ట్వీట్ లో ”ఇది అత్యంత నీచాతినీచం కంటే ఎక్కువ. ఓ మహిళతో వ్యవహరించాల్సిన విధానం ఇది ఎంతమాత్రం కాదు. మనం మరొకరి పట్ల ఇంత భయంకరంగా ఎలా ఉండగలము? ఓ మనిషి పట్ల ఎలాంటి గౌరవం చూపకుండా దారుణంగా వ్యవహరించారు. ఇలాంటి పరిస్థితి చూడటం చాలా హృదయ విదారకం’’ అని ఆవేదన వ్యక్తం చేసింది. ఇంతకముందు కూడా మంచు లక్ష్మి రియా కు మద్ధతు తెలుపుతూ పోస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే. మీడియా ఓ అమ్మాయిని భూతంగా చూపిస్తోందని.. న్యాయ వ్యవస్థలపై నమ్మకముంచి నిజానిజాలు బయటపడే వరకు ఆమెను వదిలేయాలని కోరింది. ఇప్పుడు మరోసారి రియాకు బాసటగా నిలుస్తూ ట్వీట్ చేసింది. దీనిపై నెటిజన్స్ పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. కొందరు రియా పై నెగెటివ్ కామెంట్స్ చేస్తుంటే మరికొంత మంది రియా పట్ల సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు.
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పూత్ మృతికి కారణం రియా చక్రవర్తి అంటూ సోషల్ మీడియాలో మెజార్టీ జనాలు అభిప్రాయం వ్యక్తం చేయడంతో పాటు కొన్ని మీడియా సంస్థలు కూడా రియా చక్రవర్తిని ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా అభివర్ణిస్తున్న నేపథ్యంలో కొందరు సినీ ప్రముఖులు ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. సుశాంత్ మృతి కేసులో నిజా నిజాలు తెలియాల్సిన అవసరం ఉందంటూనే రియా ఇంకా దోషిగా తేలక ముందే ఆమెను మానసికంగా హింసించడం కరెక్ట్ కాదంటూ మంచు లక్ష్మి తాజా సోషల్ మీడియా పోస్ట్ లో పేర్కొంది.
రియాకు అనుకూలంగా ఆమెను సపోర్ట్ చేస్తున్నట్లుగా మంచు లక్ష్మి చేసిన పోస్ట్ తో సుశాంత్ అభిమానులు రెచ్చిపోయారు. ఇదే సమయంలో సుశాంత్ కుటుంబ సభ్యులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. సుశాంత్ మేనకోడలు మల్లిక సింగ్ ఇన్ స్టాగ్రామ్ లో ఈ విషయమై స్పందిస్తూ.. నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు సినీ కుటుంబం అంటూ ముందుకు వచ్చారు. సహ నటులు అంటూ ఇప్పుడు మాట్లాడుతున్న వారు ఇంతకు ముందు ఏమయ్యారో అంటూ మల్లిక పోస్ట్ చేసింది. ఇంకా చాలా మంది కూడా చాలా రకాలుగా మంచు లక్ష్మిని ట్రోల్ చేశారు. అయితే తాప్సితో పాటు మరికొందరు ఆమె ట్వీట్ ను సమర్ధిస్తూ కామెంట్స్ చేశారు.
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి ఆరోపణలు ఎదుర్కుంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసుని దర్యాప్తు చేస్తున్న సీబీఐ గత మూడు రోజులుగా రియా చక్రవర్తిని విచారిస్తోంది. అయితే ఈ కేసులో నిజానిజాలు తెలియనప్పటికీ రియా చక్రవర్తి దోషి అన్నట్లు నేషనల్ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వెలువడుతున్నాయి. దీంతో అందరి దృష్టిలో ఆమె వల్లనే సుశాంత్ మరణించాడు అని అందరూ నమ్మే పరిస్థితి వచ్చింది. అయితే నిజం తెలియకుండా ఒక వ్యక్తిని దోషిగా భావించి ట్రోల్స్ చేయడం కరెక్ట్ కాదనేది మరికొందరి వాదన. ఈ క్రమంలో ఇటీవల రియా చక్రవర్తి మీడియా ముందుకు వచ్చి ప్రముఖ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేసాయ్ తో ఇంటర్వ్యూలో పాల్గొంది. తనతో పాటు సుశాంత్ కి సంబంధించిన అనేక విషయాలు వెల్లడించింది. దీని తర్వాత సోషల్ మీడియా వేదికగా #JusticeForRheaChakraborty రియాకు మద్ధతు తెలుపుతున్నారు. అయితే సినీ ఇండస్ట్రీ ప్రముఖులు మాత్రం ఎవరూ స్పందించలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మంచు మోహన్ బాబు కుమార్తె నటి మంచు లక్ష్మి స్పందించింది. ట్విట్టర్ వేదికగా #JusticeForSushanthSinghRajput #JusticeForRheaChakraborty అంటూ పోస్ట్ పెట్టింది.
”నేను రియా చక్రవర్తి – రాజ్ దీప్ సర్దేసాయ్ ల పూర్తి ఇంటర్వ్యూ చూశాను. నేను దీనిపై స్పందించాలా వద్దా అనే దాని గురించి చాలా ఆలోచించాను. నేను చాలా మంది సైలెంటుగా ఉండటం చూస్తున్నాను ఎందుకంటే మీడియా ఒక అమ్మాయిని ఒక రాక్షసిగా చేసింది. నాకు నిజం తెలియదు. కానీ నేను సత్యాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను. నిజం చాలా నిజాయితీగా బయటకు వస్తుందని నేను ఆశిస్తున్నాను. న్యాయ వ్యవస్థపై మరియు సుశాంత్ కు న్యాయం చేయడంలో పాలుపంచుకున్న అన్ని ఏజెన్సీలపై నాకు పూర్తి నమ్మకం ఉంది. కానీ అప్పటి వరకు మనం నిజాలు తెలియకుండా ఆ వ్యక్తిని.. ఆమె కుటుంబం మొత్తాన్ని కించపరచకుండా ఉండొచ్చు. మీడియా ట్రయల్స్ అని పిలవబడే వాటితో కుటుంబం మొత్తం అనుభవిస్తున్న బాధను నేను ఊహించగలను. ఇలాంటివి నాకు జరిగితే నా గురించి తెలిసిన నా కొలీగ్స్ ని నాకోసం నిలబడాలని నేను కోరుకుంటాను. నిజం అధికారికంగా వెల్లడయ్యే వరకు ఆమెను ఒంటరిగా వదిలేయండి. మనం ఎలా మారిమనే దానితో నేను బాధపడుతున్నాను. మన స్వరం వినిపించాల్సి వచ్చినప్పుడు మనం హార్ట్ ఫుల్ గా మాట్లాడకపోతే మనం ఎలా ప్రామాణికం అవుతాము. నేను నా కొలీగ్ కోసం నిలబడతాను” అని మంచు లక్ష్మి పోస్ట్ చేసింది. దీనికి మీరు చెప్పింది కరెక్ట్ అంటూ నెటిజన్స్ మద్ధతు తెలుపుతున్నారు. ఇప్పటి వరకు దీనిపై ఎవరూ స్పందించకపోయినా దైర్యంగా ముందుకు వచ్చి మీ ఒపీనియన్ చెప్పారు అని కామెంట్స్ పెడుతున్నారు. ఒక అమ్మాయికి సపోర్ట్ చేయడానికి అన్ని ఇండస్ట్రీల ప్రముఖులు వెనుకాడుతుంటే మంచు లక్ష్మి ముందుకు రావడం గొప్ప విషయమని అంటున్నారు. ఇక రాజ్ దీప్ సర్దేసాయ్ సైతం చాలా బాగా చెప్పారని కామెంట్ చేశారు.