బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ప్రతి నిత్యం ఏదొక విధంగా వార్తల్లో నిలుస్తూ వస్తోంది. హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తరువాత కంగనా బాలీవుడ్ పైన.. శివసేన ఆద్వర్యంలోని మహారాష్ట్ర ప్రభుత్వంపైనా ఆరోపణలు చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో మహా సర్కారుకి కంగనాకు మధ్య జరుగుతున్న మాటల యుద్ధం సంగతి తెలిసిందే. చాన్స్ దొరికినప్పుడల్లా మహారాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు ఆయన కుమారుడు ఆదిత్య ఠాక్రే మరియు శివసేన నాయకులపై ఫైర్ అవుతూ మీడియాకు కలవాల్సినంత న్యూస్ ఇస్తోంది. అయితే ఇప్పుడు కంగనా పట్ల అనుచితంగా ప్రవర్తించిన మీడియా సిబ్బందిపై ఇండిగో విమాన సంస్థ నిషేధం విదించినట్లు తెలుస్తోంది.
కంగనా రనౌత్ ఈనెల 9న చండీగఢ్ నుంచి ముంబైకి ఇండిగో విమానంలో బయలుదేరింది. అయితే ఆ విమానంలో బాలీవుడ్ నటితో పాటు పలువురు మీడియా సిబ్బంది కూడా ఉన్నారు. ఆ సందర్బంలో విమానంలో మీడియా సిబ్బంది కరోనా వైరస్ నియమాలు గాలికి వదిలేశారని.. డీజీసీఏ నిబంధనలు పాటించలేదని అనుమతి లేకుండా ఫోటోలు వీడియోలు తీశారని మీడియాపై కంగనా ఆరోపణలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ఇండిగో విమాన సంస్థ.. నటి కంగనా విషయంలో 9 మంది ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బంది అనుచితంగా ప్రవర్తించారని విచారణలో వెలుగు చూసిందని.. అందుకే మీడియా సిబ్బందిపై 15 రోజులు విమాన ప్రయాణాలపై నిషేధం విధిస్తున్నట్లు తెలిపింది. డీజీసీఏ రూల్స్ పాటించని ఆ 9 మంది మీడియా సిబ్బందిపై అక్టోబర్ 15 నుంచి 30 వరకు ఇండిగో విమానాల్లో ప్రయాణించకుండా నిషేధం విధించారు. మొత్తం మీద కంగనా రనౌత్ దెబ్బతో ఇప్పుడు మీడియా సిబ్బందికి కూడా సమస్యలు మొదలయ్యాయి.
ఎవరూ గీత దాటకూడదు. కానీ.. అందుకు భిన్నంగా తమకు తోచినట్లుగా వ్యవహరించే ధోరణి మీడియాలో ఎక్కువ అవుతుంది. బాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి ముంబయిలో చోటు చేసుకున్న హైడ్రామానే దీనికి నిదర్శనం. అధికారుల విచారణకు హాజరయ్యే సినీ తారలను ప్రశ్నించేందుకు కొన్ని చానళ్లు వ్యవహరించిన తీరు చూసి.. ఇదెక్కడి ఆరాచకమని ఫీలైనోళ్లు లేకపోలేదు. కొన్ని చానళ్లు తమకు తామే కోర్టులుగా భావిస్తూ తీర్పులు చెప్పేసేలా వ్యాఖ్యలు చేయటం.. ముఖం ముందు మైకు పెట్టేసి.. నేను అడుగుతాను.. నువ్వు చెబుతావా? లేదా? అంటూ ఫోర్సు చేసిన తీరుకు చాలామంది అవాక్కు అయ్యారు.
చానళ్ల అత్యుత్సాహానికి చాలామంది సినీ తారలు.. సెలబ్రిటీలు నొచ్చుకున్నా.. నోరు మూసుకున్నారే తప్పించి సరైన తీరులో వ్యవహరించింది లేదు. కొద్దిమంది మాత్రంసోషల్ మీడియాలో తమ ఆవేదనను వ్యక్తం చేశారు. అయితే.. బాలీవుడ్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ పేరు బయటకు రావటం సంచలనంగా మారింది. ఆమె పాత్ర ఎంతన్న విషయంపై క్లారిటీ లేకున్నా.. ఆమె ఫోటోలు వేసేసి ప్రింట్ మీడియా.. ఆమె ఫోటోలు.. వీడియోల్ని ప్రసారం చేస్తూ చానళ్లు పండగ చేసుకున్నాయి.
వీరి తీరుకు ఒళ్లు మండిన ఆమె మిగిలిన వారికి భిన్నంగా రియాక్ట్ అయ్యారు. నిజాల్ని.. ఆధారాల్ని వదిలేసి.. అదేపనిగా విమర్శించటం.. ఆరోపణల పేరుతో బురద జల్లుతున్న తీరును తప్పు పడుతూ.. చానళ్లకు ఈ అధికారం ఎవరిచ్చారు? అన్న క్వశ్చన్ ను సంధించారు రకుల్. అదేదో సోషల్ మీడియాలో పోస్టు పెట్టటం లాంటి పనులు చేయకుండా.. ఏకంగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
నిజానిజాలు తేలకుండానే తన పరువుకు నష్టం కలిగేలా కార్యక్రమాల్ని ప్రసారం చేస్తున్నట్లుగా చెప్పిన ఆమె.. తనకు న్యాయం చేయాలని కోరారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. చానళ్లకు హోల్ సేల్ సూచన చేస్తున్నట్లుగా చేస్తూనే.. ఇవ్వాల్సిన వార్నింగ్ ఇచ్చేశారని చెప్పాలి. ప్రైవేటు టీవీ చానళ్లు అన్ని కచ్ఛితంగా తమ ప్రోగ్రామ్ కోడ్ ను అనుసరించి పని చేయాలని.. ఎవరినైనా సరే విమర్శించేలా.. అప్రతిష్టపాలు చేసేలా ఉండరాదని కోరింది.
పరువునష్టం కలిగించే విధంగా తప్పుడు వార్తల్ని ప్రసారం చేయటం.. ఉద్దేశపూర్వకంగా అర్థసత్యాల్ని వార్తల రూపంలో జనాల మీదకు వదలటం లాంటివి చేయకూడదని పేర్కొంది. వ్యక్తుల్ని.. సమూహాన్ని.. దేశంలోని సామాజిక.. నైతిక జీవనంపై విమర్శలు చేయకూడదని చెప్పింది. తాము చెప్పిన సూచనల్ని తప్పకుండా పాటించాలని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. మొత్తానికి చెలరేగిపోతున్న చానళ్ల దూకుడుకు సైలెంట్ గా చెక్ చెప్పిన రకుల్ ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే.
కొత్త దందా ఒకటి బయటకు వచ్చింది. సంచలనంగా మారిన ఈ ఉదంతం ఇప్పుడు ఉలిక్కిపడేలా చేస్తోంది. ఆకర్షణీయమైన ఉద్యోగ ప్రకటనతో మొదలయ్యే ఈ గాలం.. చివరకు ఎన్ని చిక్కుల్ని తీసుకొస్తుందన్న విషయాన్ని ఒక మీడియా సంస్థ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో బయటకు వచ్చింది. లేడీ డిటెక్టివ్ ఉద్యోగం అంటూ యువతులకు మాత్రమే అంటూ ఎర వేయటం.. అందమైన యువతుల్ని ట్రాప్ లోకి లాగే ఈ దుర్మార్గంపై ఇప్పుడు రాచకొండ పోలీసులు ఫోకస్ పెట్టారు.
అన్నింటికి తెగించాలని.. అర్థరాత్రిళ్లు రమ్మన్నా రావాలని.. పనిలో అదరగొట్టేస్తే.. సినిమాల్లో నటించే అవకాశం కూడా ఉంటుందని చెబుతూ.. యువతుల్ని టార్గెట్ చేసే ఈ దందాకు కర్త.. కర్మ.. క్రియ రామకృష్ణ అనే వ్యక్తిగా తేల్చారు. తానో ప్రముఖ మీడియా సంస్థలో ఉన్నత హోదాలో ఉన్నట్లు చెప్పుకుంటాడు. అంతేకాదు.. డీజీపీ మొదలు పోలీసు బాసులంతా తనకు తెలుసని..ఆ మాటకు వస్తే మంత్రి కేటీఆర్ కూడా క్లోజేనని అతగాడు తియ్యటి మాటలతో ట్రాప్ చేస్తుంటాడు.
సదరు మీడియా సంస్థ స్టింగ్ ఆపరేషన్ లో భాగంగా ఇద్దరు యువతుల్ని రామకృష్ణ వద్దకు డిటెక్టివ్ ఉద్యోగాల కోసం పంపగా.. తన విశ్వరూపాన్ని చూపించాడు. రిస్కు ఎంతో ఉంటుందని.. ఏదైనా జరిగే తనకు బాధ్యత లేదంటూనే.. నెలవారీ జీతాల్ని ఇవ్వలేమని.. పని చేసిన రోజులకే డబ్బులు ఇస్తామని చెప్పుకొచ్చాడు.
బుజ్జి అనే వ్యక్తిని పరిచయం చేస్తూ.. అతగాడు సినిమా డైరెక్టర్ అని మహిళలకు పరిచయం చేయగా.. సదరు బుజ్జికి మాత్రం ఆ ఇద్దరు అమ్మాయిలు తన అసిస్టెంట్లు అని.. లేడీ డిటెక్టివ్ లుగా పరిచయం చేశాడు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. అప్పటికి ఆ ఇద్దరు మహిళలు ఇంకా జాబ్ లోకి చేరకపోవటం. ఇంతకీ ఈ బుజ్జి ఎవరన్న విషయాన్ని ఆరా తీస్తే.. రామకృష్ణతో కలిసి అతగాడు మహిళల్ని అలా మోసం చేస్తారని తేల్చారు.
అర్థరాత్రిళ్లు రమ్మన్నా రావాలని.. తానో బేసిక్ ఫోన్.. సిమ్ కార్డు ఇస్తానని.. అర్థరాత్రిళ్లు తాను చెప్పే మగాళ్లకు ఫోన్లు చేసి.. ట్రాప్ చేయాలని చెప్పాడు. అర్థరాత్రిళ్లు తనతో కలిసి పని చేయాలని.. చీరలు.. పంజాబీ డ్రస్ లు కాకుండా మోడర్న్ డ్రెస్సులు వేసుకోవాలనే ఇతగాడి లీలలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఇతడు ఎవరు? అతగాడి బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? రామకృష్ణ.. బుజ్జిన బారిన ఎంతమంది మహిళలు పడ్డారు లాంటి అంశాలపై రాచకొండ పోలీసులు ఇప్పుడు నజర్ వేశారు.