ఎన్నికలొస్తున్నాయి అంటే అందుకు తగ్గట్టు స్టార్ల సినిమాల్లో కంటెంట్ కూడా మారుతుంటుంది. ఇక రాజకీయాల్లో ఉన్న స్టార్లు నటించే సినిమాలు పొలిటికల్ కథాంశంతో వేడెక్కించేవే అయ్యి ఉంటాయి. రాజకీయాలు సామాజిక సేవ అంటూ ప్రత్యర్థులపై పంచ్ లు అదిరిపోయే రేంజులో ఉంటాయి. ఇంతకుముందు ఎన్నికల ముందు విజయ్ నటించిన మెర్సల్ ఈ తరహాలోనే వచ్చి వివాదాస్పదమైంది. ఓటు హక్కు నేపథ్యంలో తంబీలు చేసిన రచ్చ చాలా దూరమే వెళ్లింది. ఆ తర్వాత విజయ్ ని తమిళనాడు ప్రభుత్వం రకరకాలుగా ఇబ్బందులకు గురి చేయడం తెలిసినదే.
అదంతా సరే కానీ.. 2021లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పలువురు అగ్ర దర్శకులు మాస్టర్ ప్లాన్ తో ముందుకు దూసుకు రావడం ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా రాజకీయ ప్రాబల్యం ఉన్న కమల్ హాసన్ లాంటి స్టార్ తో మురుగదాస్ తొడకొట్టించేందుకు గట్టి ప్లాన్ లోనే ఉన్నాడట.
అందుకోసం ఏకంగా దళపతి విజయ్ సినిమానే వదిలేస్తున్నాడట. ఇప్పటికే విజయ్ తో ప్లాన్ ని పక్కన పెట్టేశాడట. నిజానికి ఈ చిత్రం 2021 ప్రథమార్థంలోనే సెట్స్ కెళ్లాల్సి ఉండగా.. అంతకంటే ముందే కమల్ హాసన్ తో సినిమాని లాక్ చేశాడట. తాజా సమాచారం ప్రకారం.. ఇటీవల యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ను ఒక ప్రత్యేకమైన సామాజిక అంశాన్ని కలిగి ఉన్న స్క్రిప్ట్ తో మురుగదాస్ సంప్రదించారు. 2021 లో కమల్ హాసన్ తన మొదటి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్నందున ఈ ఏడాది చివరి నాటికి ఈ ప్రాజెక్టును ప్రారంభించి ఎన్నికలకు ముందే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇదే నిజమైతే విజయ్ తో సినిమాని మురుగదాస్ పక్కన పెట్టినట్టేనన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
చట్టం ఎప్పుడూ బలవంతుడి చుట్టం. దానిలోని లొసుగుల్ని వాడుకుని ఎంతకైనా తెగించే ఒక సెక్షన్ సంఘంలో ఎప్పుడూ ఉంటుంది. అలాంటి పవర్ ప్యాక్డ్ సంపన్న సెక్షన్ పెద్ద మనుషులు ఉత్తరాదిన ఒకానొక కాలంలో పాల్పడిన దౌర్జన్యకాండను దళిత యువతుల అత్యాచార ఘటనల్ని తెరపైకి తెస్తూ రూపొందించిన బాలీవుడ్ చిత్రం ఆర్టికల్ 15.
ఆయుష్మాన్ ఖురానా కేసు ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా నటించారు. ఓవైపు కింది అధికారి కేసు దర్యాప్తు చేస్తుంటే నిజాలు నిగ్గు తేలుస్తూంటే అడుగడుగునా ఎలాంటి ఆటంకాలు ఎదురయ్యాయి? అన్నది తెరపై అద్భుతంగా చూపారు. పై అధికారిగా వచ్చే ప్రకాష్ రాజ్ ఆ కేసును మాఫీ చేసేందుకు ఎలాంటి ప్యాకేజీ మాట్లాడుకున్నాడు? అన్నది చూపించడం ఆసక్తికరం.
అంటరానితం.. దళిత యువతుల గ్యాంగ్ రేప్ ఘటనలకు సంబంధించిన పలు నిజ జీవిత సంఘటనల నుండి ప్రేరణ పొంది రూపొందించిన ఈ చిత్రం కమర్షియల్ గానూ ఘనవిజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమాని సౌత్ లో ఉదయనిధి స్టాలిన్ కథానాయకుడిగా రీమేక్ చేస్తున్నారు. అరుణరాజా కామరాజ్ దర్శకుడు. రెడ్ జెయింట్ మూవీస్- బే వ్యూ ప్రాజెక్ట్స్ ఎల్ఎల్పి (బోనీ కపూర్) మరియు జీ స్టూడియోలు సంయుక్తంగా ఈ తమిళ రీమేక్ ను నిర్మించనున్నాయి. త్వరలో సెట్స్ కెళ్లనున్నారు. 2021 ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతున్న స్టాలిన్ డీఎంకే పార్టీ యువజన కార్యదర్శి అన్న సంగతి తెలిసిందే. సరైన టైమింగులో సరైన కథాంశాన్ని ఎంపిక చేసుకుని బరిలో దిగుతున్నాడన్నమాట.