మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటేనే కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ఉండాలని ప్రతి ఒక్కరు ఆశిస్తూ ఉంటారు. ఆయన అభిమానులు ఖచ్చితంగా చిరు మార్క్ డాన్స్ లు ఉండాల్సిందే అంటారు. చిరు రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్ టైనర్ లు ఎప్పుడు కూడా సక్సెస్ మిస్ అవ్వలేదు. ఖైదీ నెం.150 సినిమాలో చిరంజీవి మార్క్ కామెడీ.. డాన్స్ మరియు యాక్షన్ ఉండటంతో ఆ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా చిరంజీవితో ప్రస్తుతం కొరటాల శివ సినిమాను తీస్తున్నాడు. అంటే ఖచ్చితంగా చిరంజీవి డాన్స్ లు ఓ రేంజ్ లో ఉండాలి. అందుకోసం కొరటాల చాలా వర్కౌట్ చేసి సంగీత దర్శకుడు మణిశర్మ నుండి అద్బుతమైన మాస్ మసాలా ట్యూన్స్ ను తీసుకున్నాడట.
కొరటాల గత సినిమాలను చూస్తే ఆయన మ్యూజిక్ పై ఎంతగా పట్టు ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మిర్చి నుండి చివరి మూవీ భరత్ అనే నేను వరకు అన్ని కూడా మ్యూజికల్ గా పాజిటివ్ రెస్పాన్స్ ను దక్కించుకున్నాయి. ఇక చాలా కాలం తర్వాత ఫామ్ లోకి వచ్చిన మణిశర్మ కు చిరంజీవి అవకాశం ఇచ్చాడు. వీరిద్దరి కాంబోలో గతంలో వచ్చిన సినిమాలు పలు సూపర్ డూపర్ గా సక్సెస్ అయ్యాయి. చాలా మ్యూజికల్ హిట్ గా నిలిచాయి. అందుకే ఆచార్య సినిమా కూడా ఖచ్చితంగా మ్యూజికల్ హిట్ గా నిలుస్తుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు.
ఈ సినిమాలో మరోసారి చిరు మార్క్ స్టెప్పులు వేయబోతున్నాడు. ఖైదీ నెం.150 సినిమా తరహాలో ఇందులోని పాటలకు కూడా జానీ మరియు శేఖర్ లు డాన్స్ ను కంపోజ్ చేసే అవకాశం కొరటాల ఇచ్చాడట. ఈ నెల 20వ తారీకు నుండి ఆచార్య షూటింగ్ పునః ప్రారంభం కాబోతుంది. చరణ్ కు కూడా ఒక పాట ఉంటుందని అంటున్నారు. కనుక ఆ పాట మరింత హైలైట్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ సినిమా షూటింగ్ వచ్చే నెల నుండి పునః ప్రారంభం కాబోతుంది. మార్చి నెలలో కరోనా కారణంగా నిలిచి పోయిన షూటింగ్ ను దాదాపు 8 నెలల తర్వాత పునః ప్రారంభించేందుకు గాను ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది. చిరంజీవి వయసు రీత్యా ఈ సినిమా షూటింగ్ ను ఇన్నాళ్లు ఆపాల్సి వచ్చిందని టాక్.
ఇప్పటికే స్టార్ హీరోల నుండి సీనియర్ హీరోల వరకు పలువురు స్టార్స్ షూటింగ్ లను ప్రారంభించారు. చిరంజీవి మాత్రం ఇంకా కొరటాల శివను వెయిటింగ్ లో పెట్టాడు. కొరటాల తదుపరి సినిమాను చేయాల్సి ఉన్న కారణంగా చిరంజీవి మరీ ఆలస్యం చేయడం భావ్యం కాదని కూడా కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఎట్టకేలకు ఆచార్య సినిమా షూటింగ్ పునః ప్రారంభంకు సంబంధించి మెగా వర్గాల నుండి లీక్ అందింది. నవంబర్ 3వ వారం నుండి చిరంజీవి షూటింగ్ లో జాయిన్ కాబోతున్నాడట. చిరంజీవితో చేయాల్సిన సీన్స్ కు సంబంధించిన కొరటాల శివ ఏర్పాట్లు చేస్తున్నాడు. తక్కువ మంది నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు ఉండేలా టీమ్ జాగ్రత్తలు తీసుకుంటుందట. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రతి ఒక్కరిని కూడా క్వారెంటైన్ లో ఉంచి ఆ తర్వాత చిరంజీవిని షూటింగ్ కు తీసుకు వచ్చే ఉద్దేశ్యంతో టీమ్ చర్యలు తీసుకుంటుందని సమాచారం.
మొత్తానికి నవంబర్ 3వ వారంలో షూటింగ్ కు హాజరు అయితే వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరి వరకు షూటింగ్ ను పూర్తి చేసే అవకాశం ఉందని మెగా వర్గాల వారు అంటున్నారు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించనుండగా కీలక పాత్రలో రామ్ చరణ్ గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నాడు. చరణ్ కు జోడీగా రష్మిక మందన్న కూడా నటించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.