Templates by BIGtheme NET
Home >> Telugu News >> రైతు ఉద్యమం ఉధృతం…డిసెంబరు 8న భారత్ బంద్

రైతు ఉద్యమం ఉధృతం…డిసెంబరు 8న భారత్ బంద్


నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ పంజాబ్ హర్యానా రైతులు చేపట్టిన నిరసన దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు రేపుతోన్న సంగతి తెలిసిందే. ఢిల్లీ శివార్లలో దాదాపు లక్ష మంది అన్నదాతలు చేపట్టిన ఆందోళనతో కేంద్ర ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ఆ చట్టాలపలై కమిటీలు ఏర్పాటు చేస్తామని చట్టాలకు సవరణలు చేస్తామని కేంద్రం ఇస్తున్న హామీలపై తమకు నమ్మకం లేదని రైతులు అంటున్నారు. ఆ చట్టాలను రద్దు చేస్తేనే తమ ఆందోళన విరమిస్తామని కుండబద్దలు కొట్టినట్టు రైతు సంఘాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో డిసెంబరు 8న దేశవ్యాప్త బంద్ కు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. అంతేకాదు ఢిల్లీకి వెళ్లే అన్ని దారులను అష్ట దిగ్బంధనం చేస్తామని హెచ్చరించాయి. దీంతోపాటు ఢిల్లీకి వెళ్లే అన్ని హై వే టోల్ గేట్లనూ ఆక్రమించి టోల్ ఫీజును వసూలు చేయకుండా అడ్డుకుంటామని వార్నింగ్ ఇచ్చాయి. శనివారంనాడు మోడీ ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేస్తామని వెల్లడించాయి.

వారం రోజులుగా ఢిల్లీ ఢిల్లీ శివారులోని నోయిడా ఘజియాబాద్ లో పంజాబ్ హర్యానాకు చెందిన దాదాపు లక్షమంది అన్నదాతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమ డిమాండ్లు నెరవేరేంతవరకు వెనక్కి వెళ్ళేది లేదని తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే ఆ రైతుల నిరసనలకు రాజస్థాన్ మహారాష్ట మధ్యప్రదేశ్ రాష్ట్రాల రైతులు కూడా తోడయ్యారు. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ సైతం రైతుల ఆందోళనకు మద్దతు పలుకుతున్నారు. తమ ఉద్యమంలో మరింత మంది రైతులు చేరుతారని రైతు సంఘం నేత హరీందర్ సింగ్ లాఖోవాల్ చెప్పారు. దేశవ్యాప్త బంద్ కు అన్ని రాష్ట్రాల రైతులు మద్దతు తెలపాలని నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేసే వరకు పోరాటటం కొనసాగించాలని కోరారు.