Templates by BIGtheme NET
Home >> Telugu News >> శివబాలాజీ ఫిర్యాదుపై హెచ్ఆర్సీ స్పందన.. ఇక ఆ స్కూల్కు చిత్తడే!

శివబాలాజీ ఫిర్యాదుపై హెచ్ఆర్సీ స్పందన.. ఇక ఆ స్కూల్కు చిత్తడే!


భారీగా ఫీజులు వసూలు చేస్తూ.. విద్యార్థులను తల్లిదండ్రులను మణికొండలోని మౌంట్ లిటేరా జీ స్కూల్ వేధిస్తున్నదని ప్రముఖ నటుడు బిగ్బాస్ విన్నర్ శివబాలాజీ హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కాగా శివబాలాజీ ఫిర్యాదుపై హెచ్ఆర్సీ స్పందించింది. ‘సదరు పాఠశాలపై వెంటనే చర్యలు తీసుకోండి.. ఈ విషయంపై మాకు వారంలోగా పూర్తిస్థాయి నివేదిక కావాలి. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తుంటే ఇంతకాలం ఎందుకు చూస్తూ ఊరుకున్నారు. ’ అంటూ హెచ్ఆర్సీ రంగారెడ్డి డీఈవోపై ఆగ్రహం వ్యక్తం చేసింది.వెంటనే ఈ అంశంపై విచారణ జరపాలని ఆదేశించింది.

ఈ సందర్భంగా శివబాలాజీ మీడియాతో మాట్లాడుతూ.. మౌంట్ లిటేరా జీ స్కూల్ ప్రభుత్వ ఆదేశాలను లెక్కచేయకుండా ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నదని మండిపడ్డారు. ఇదేంటని అడిగితే బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. పిల్లలకు ఆన్లైన్ క్లాసులు చెప్పకుండా ఐడీ బ్లాక్ చేస్తున్నారని మండిపడ్డారు. కాగా ఈ విషయంపై ఇంకా స్కూల్ యాజమాన్యం స్పందించలేదు. ఒక్క మౌంట్ లిటేరా జీ స్కూలే కాదు హైదరాబాద్లోని చాలా కార్పొరేట్ పాఠశాలలు ఇదే తరహాలో భారీ ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఆన్లైన్ క్లాసుల పేరుతో నిలువు దోపిడీకి యత్నిస్తున్నాయి. ఈ ఘటనలపై ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని కార్పొరేట్ స్కళ్ల దందాను నిలువరించాలని ప్రజాసంఘాలు విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.