టీఆర్ఎస్ ఎమ్మెల్యే బూతుల ఆడియో వైరల్

0

టీఆర్ఎస్ ఎమ్మెల్యే బూతుల పర్వం చర్చనీయాంశంగా మారింది. ఆయన మాట్లాడిన బూతు మాటల ఆడియో లీక్ అయ్యింది. అదిప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారింది.

కరీంనగర్ జిల్లా మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ను బెజ్జంకి మండల సమస్యలపై ఓ యువకుడు ప్రశ్నించాడు. దీనికి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ దారుణమైన బూతులతో నిందించాడని బెజ్జంకి మండలం బేగంపేటకు చెందిన పోతిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి ఆ ఆడియోను మీడియాకు విడుదల చేశాడు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి అసభ్య పదజాలంతో తిడుతూ ‘నీ అంతు చూస్తా’ అని బెదిరించాడని బాధితుడు ఆరోపించాడు. నియోజకవర్గ సమస్యలపై సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అంతు చూస్తానని ఎమ్మెల్యే ఆగ్రహంతో ఊగిపోయాడని యువకుడు ఆరోపించాడు.

ఎమ్మెల్యే రసమయి తాజాగా రాజశేఖర్ కు ఫోన్ చేసి ‘రోజూ మమ్మల్ని బూతులు తిడుతూ సోషల్ మీడియాలో పెడుతున్నావని.. తిక్క రేగుతోందా? లం. కొడుకా అంటూ ’ దారుణమైన తిట్లతో విరుచుకుపడ్డాడని ఆ ఆడియోను బాధితుడు విడుదల చేశాడు.

దీనికి బాధితుడు రాజశేఖర్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. ఎమ్మెల్యే అయ్యిండి బూతులు తిడతావా? రెండు సార్లు ఎన్నుకున్నందుకు మేం సిగ్గుపడుతున్నాం.. మీకు తల్లిదండ్రులు సంస్కారం నేర్పలేదా అని గట్టిగానే ఎమ్మెల్యేను నిలదీశాడు. ఇప్పుడు ఆడియో టేప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.