థియేటర్లలోకి మళ్లీ బాహుబలి!

0

దిగ్గజ దర్శకుడు ఎస్. ఎస్. రాజమౌళి తెరకెక్కించిన అద్భుత దృశ్య కావ్యం ‘బాహుబలి’ సీరిస్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ఎంత సంచలన విజయం సాధించాయో అందరికీ తెలిసిందే. ఆ సినిమా హీరో రెబల్ స్టార్ ప్రభాస్ ఈ సినిమాతో దేశంలోనే టాప్ హీరోగా మారిపోయాడు. అంతే కాదు ప్రపంచంలో చాలా దేశాల్లో గుర్తింపు సాధించాడు. ఇప్పుడు వరుస పెట్టి మరో మూడు పాన్ ఇండియన్ సినిమాలను ప్రభాస్ చేస్తున్నాడు.బాహుబలి సిరీస్ సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచి మొదటి భాగం సుమారు 700కోట్ల రూపాయలు రెండో భాగం రెండు వేల కోట్లకు పైగా వసూళ్లు సాధించి సినీ విశ్లేషకులను సైతం అబ్బురపరిచాయి. ఆ అద్భుత దృశ్య కావ్యాలు మరోసారి థియేటర్లలో సందడి చేయనున్నాయి.

మహారాష్ట్రలో నిబంధనలు పాటిస్తూ థియేటర్ల ప్రారంభానికి అక్కడి ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికిప్పుడు థియేటర్లలో విడుదలయ్యే సినిమాలు అంతంతమాత్రంగానే ఉండడంతో బాహుబలి బాలీవుడ్ పంపిణీ దారుడు కరణ్ జోహార్ మరోసారి ఈ సినిమాలను థియేటర్లలో విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ శుక్రవారం ‘బాహుబలి- ద బిగినింగ్’ రిలీజ్ చేస్తామని వచ్చే శుక్రవారం ‘బాహుబలి- ద కంక్లూజన్’ రిలీజ్ అవుతుందని కరణ్ జోహార్ ప్రకటించారు. సినిమా విడుదల అవుతున్న ఆయా నగరాల్లో ప్రభుత్వ నిబంధనల మేరకు బాహుబలి చిత్రాలను విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు. బాహుబలి మొదటి రెండు పాదాలు మళ్ళీ విడుదల అవుతుండటంతో ఉత్తరాదిన ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ థియేటర్లలో మళ్లీ సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. కరోనా కారణంగా కొన్ని నెలలుగా సినిమాలు థియేటర్లో సినిమాలే కరువైన సమయంలో బాహుబలి మళ్ళీ థియేటర్లకు వస్తుండడంతో ఆ చిత్రాన్ని మళ్లీ లెక్కించేందుకు అభిమానులు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు.