నిజానిజాలు తెలిసే వరకు ఆమెను ఒంటరిగా వదిలేయండి : మంచు లక్ష్మి

0

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి ఆరోపణలు ఎదుర్కుంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసుని దర్యాప్తు చేస్తున్న సీబీఐ గత మూడు రోజులుగా రియా చక్రవర్తిని విచారిస్తోంది. అయితే ఈ కేసులో నిజానిజాలు తెలియనప్పటికీ రియా చక్రవర్తి దోషి అన్నట్లు నేషనల్ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వెలువడుతున్నాయి. దీంతో అందరి దృష్టిలో ఆమె వల్లనే సుశాంత్ మరణించాడు అని అందరూ నమ్మే పరిస్థితి వచ్చింది. అయితే నిజం తెలియకుండా ఒక వ్యక్తిని దోషిగా భావించి ట్రోల్స్ చేయడం కరెక్ట్ కాదనేది మరికొందరి వాదన. ఈ క్రమంలో ఇటీవల రియా చక్రవర్తి మీడియా ముందుకు వచ్చి ప్రముఖ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేసాయ్ తో ఇంటర్వ్యూలో పాల్గొంది. తనతో పాటు సుశాంత్ కి సంబంధించిన అనేక విషయాలు వెల్లడించింది. దీని తర్వాత సోషల్ మీడియా వేదికగా #JusticeForRheaChakraborty రియాకు మద్ధతు తెలుపుతున్నారు. అయితే సినీ ఇండస్ట్రీ ప్రముఖులు మాత్రం ఎవరూ స్పందించలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మంచు మోహన్ బాబు కుమార్తె నటి మంచు లక్ష్మి స్పందించింది. ట్విట్టర్ వేదికగా #JusticeForSushanthSinghRajput #JusticeForRheaChakraborty అంటూ పోస్ట్ పెట్టింది.

”నేను రియా చక్రవర్తి – రాజ్ దీప్ సర్దేసాయ్ ల పూర్తి ఇంటర్వ్యూ చూశాను. నేను దీనిపై స్పందించాలా వద్దా అనే దాని గురించి చాలా ఆలోచించాను. నేను చాలా మంది సైలెంటుగా ఉండటం చూస్తున్నాను ఎందుకంటే మీడియా ఒక అమ్మాయిని ఒక రాక్షసిగా చేసింది. నాకు నిజం తెలియదు. కానీ నేను సత్యాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను. నిజం చాలా నిజాయితీగా బయటకు వస్తుందని నేను ఆశిస్తున్నాను. న్యాయ వ్యవస్థపై మరియు సుశాంత్ కు న్యాయం చేయడంలో పాలుపంచుకున్న అన్ని ఏజెన్సీలపై నాకు పూర్తి నమ్మకం ఉంది. కానీ అప్పటి వరకు మనం నిజాలు తెలియకుండా ఆ వ్యక్తిని.. ఆమె కుటుంబం మొత్తాన్ని కించపరచకుండా ఉండొచ్చు. మీడియా ట్రయల్స్ అని పిలవబడే వాటితో కుటుంబం మొత్తం అనుభవిస్తున్న బాధను నేను ఊహించగలను. ఇలాంటివి నాకు జరిగితే నా గురించి తెలిసిన నా కొలీగ్స్ ని నాకోసం నిలబడాలని నేను కోరుకుంటాను. నిజం అధికారికంగా వెల్లడయ్యే వరకు ఆమెను ఒంటరిగా వదిలేయండి. మనం ఎలా మారిమనే దానితో నేను బాధపడుతున్నాను. మన స్వరం వినిపించాల్సి వచ్చినప్పుడు మనం హార్ట్ ఫుల్ గా మాట్లాడకపోతే మనం ఎలా ప్రామాణికం అవుతాము. నేను నా కొలీగ్ కోసం నిలబడతాను” అని మంచు లక్ష్మి పోస్ట్ చేసింది. దీనికి మీరు చెప్పింది కరెక్ట్ అంటూ నెటిజన్స్ మద్ధతు తెలుపుతున్నారు. ఇప్పటి వరకు దీనిపై ఎవరూ స్పందించకపోయినా దైర్యంగా ముందుకు వచ్చి మీ ఒపీనియన్ చెప్పారు అని కామెంట్స్ పెడుతున్నారు. ఒక అమ్మాయికి సపోర్ట్ చేయడానికి అన్ని ఇండస్ట్రీల ప్రముఖులు వెనుకాడుతుంటే మంచు లక్ష్మి ముందుకు రావడం గొప్ప విషయమని అంటున్నారు. ఇక రాజ్ దీప్ సర్దేసాయ్ సైతం చాలా బాగా చెప్పారని కామెంట్ చేశారు.