భారత వైమానిక దళంలో చేరిన రాఫెల్స్

0

ఫ్రాన్స్కి చెందిన దసాల్ట్ ఏవియేషన్ సంస్థకు భారత్ ఆర్డర్ ఇచ్చిన 36 రాఫెల్ విమానాల్లో ఐదు ఈ మద్యే దేశానికి చేరిన సంగతి తెలిసిందే. కొన్ని రోజులుగా హర్యానాలోని అంబాల వైమానిక స్థావరంలో ఉన్న ఈ విమానాలు ఈ రోజు భారత వైమానిక దళంలో చేరాయి. అంబాల ఎయిర్ బేస్ లో జరిగే ఈ కార్యక్రమానికి భారత ఫ్రాన్స్ రక్షణశాఖ మంత్రులు రాజ్నాథ్ సింగ్ ఫ్లోరెన్స్ పార్లీ చీఫ్ అఫ్ డిఫెన్స్ బిపిన్ రావత్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భాదౌరియా డిఫెన్స్ సెక్రటరీ అజయ్ కుమార్ తదితరులు హాజరయ్యారు.

‘సర్వ ధర్మ పూజ’ నిర్వహించిన తర్వాత ఈ యుద్ధ విమానాల విన్యాసాలను రాజ్ నాథ్ వీక్షించారు. భారత వాయుసేన అమ్ములపొదిలో రాఫెల్స్ చేరడం ఇండియా-ఫ్రాన్స్ మధ్య ఉన్న బలమైన బంధానికి చిహ్నమని రాజ్ నాథ్ సింగ్ ఈ సందర్భంగా చెప్పారు. స్వేచ్ఛ సమానత్వం సోదరభావం వసుదైక కుటుంబం అన్న సూత్రాలకు రెండు దేశాలు కట్టుబడి ఉన్నట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ తెలిపారు. ఈ సూత్రాలనే రెండు దేశాలు ప్రపంచవ్యాప్తం చేస్తున్నాయన్నారు. భారత స్వాసంత్య్రం తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడినట్లు చెప్పారు. రాఫేల్ ఇండక్షన్ కార్యక్రమంలో ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పాల్గొనడం రెండు దేశాల మధ్య బలమైన రక్షణ భాగస్వామ్యాన్ని గుర్తు చేస్తోందన్నారు.

కాగా భారత్-పాక్ సరిహద్దుకు 220 కిలోమీటర్ల దూరంలో అంబాల వైమానిక స్థావరం ఉంటుంది. ఈ అత్యాధునిక యుద్ధ విమానాలు భారత వాయుదళ శక్తిని మరింత పెంచనున్నాయి. ట్యాంకర్ నుంచి రాఫెల్ విమానాలు గాల్లోనే ఇంధనం నింపుకోగలవు. ప్రస్తుతం సరిహద్దుల్లో ఉన్న వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఈ ఇండక్షన్ ఎంతో కీలకమైందన్నారు. ఇటీవల తాను విదేశీ టూర్ కు వెళ్లానని అక్కడ భారత్ అభిప్రాయాన్ని సుస్పష్టం చేసినట్లు రాజ్ నాథ్ తెలిపారు. ఎటువంటి పరిస్థితుల్లో తమ భూభాగాన్ని వదులుకునేది లేదని తేల్చిచెప్పినట్లు గుర్తు చేశారు. నాలుగేళ్ల క్రితం భారత ప్రభుత్వం 36 అత్యాధునిక రాఫెల్ యుద్ధ విమానాల కోసం ఫ్రాన్సుతో రూ.59 వేల కోట్ల కొనుగోలు అగ్రిమెంట్ కుదుర్చుకుంది. మొదటి విడత ఫ్రాన్సులోని మెరిగ్నాక్ వైమానిక కేంద్రం నుంచి 5 రాఫెల్ యుద్ధ విమానాలు బయలుదేరాయి. ఇవి పంజాబ్ లోని అంబాలా వైమానిక స్థావరానికి చేరుకున్న సంగతి తెలిసిందే.