పోలీసులకు లొంగిపోయిన ఆర్ఎక్స్ 100 నిర్మాత

0

బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో మూడో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొని పరారీలో ఉన్న ఆర్ఎక్స్ 100 సినిమా నిర్మాత అశోక్ రెడ్డి ఎట్టకేలకు పోలీసుల ముందు లొంగిపోయారు. ఆయనను అరెస్ట్ చేశారు. శ్రావణి ఆత్మహత్యకు కారణమైన ముగ్గురు నిందితుల్లో దేవరాజ్ రెడ్డి సాయికృష్ణారెడ్డిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసి మీడియా ముందు హాజరుపరిచారు. వీరిని విచారించి రిమాండ్ రిపోర్ట్ కూడా సిద్ధం చేశారు. ఈ కేసులో ఎ3గా ఉన్న అశోక్ రెడ్డికి పోలీసులు ముందుగానే నోటీసులు ఇచ్చారు.

సోమవారం ఎస్.ఆర్.నగర్ పోలీస్ స్టేషన్కు విచారణ నిమిత్తం వస్తానని చెప్పి చివరి నిమిషంలో అశోక్ రెడ్డి మస్కా కొట్టారు. సెల్ఫోన్ స్విచ్ఛాప్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లారు. సినీరంగంలో అవకాశాలు ఇప్పిస్తానంటూ ఆశ చూపి శ్రావణితో అశోక్ రెడ్డి సంబంధం ఏర్పరచుకున్నట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. దేవరాజ్కు శ్రావణి దగ్గర కావటాన్ని అశోక్ రెడ్డి జీర్ణించుకోలేకపోయారని పోలీసులు తెలిపారు. సాయికృష్ణా రెడ్డి ద్వారా ఒత్తిడి తెచ్చి ఇద్దరూ విడిపోయేందుకు సహకరించినట్టు తెలుస్తోంది.

ఓ హోటల్ వద్ద శ్రావణి దేవరాజ్ తో గొడవ అనంతరం సాయికృష్ణ ఆమెను ఇంటికి తీసుకెళ్లి దాడి చేశారు. ఆత్మహత్యకు ముందు రోజు జరిగిన ఈ గొడవకు కారణం అశోక్ రెడ్డి అని పోలీసులు ఆధారాలు సేకరించారు.. రిమాండ్ రిపోర్టులో శ్రావణి ఆత్మహత్యకు కారణంగా అశోక్ రెడ్డిని చేర్చినట్టుగా తెలిసింది. తనను వివాహం చేసుకోవాలంటూ శ్రావణిని అశోక్ రెడ్డి వేధించినట్టుగా పోలీసులు గుర్తించారు.

అశోకర్ రెడ్డిని వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక పరీక్షలు కరోనా టెస్ట్ అనంతరం ఆయనను రిమాండ్ కు పోలీసులు తరలిస్తారు.