Templates by BIGtheme NET
Home >> Cinema News >> అదే విజయ్ దేవరకొండ స్టైల్

అదే విజయ్ దేవరకొండ స్టైల్


బలమైన సినిమా నేపథ్యం కలిగిన ఇంటి నుంచి వచ్చినవారికే సినిమా ఫీల్డ్ లో ఈజీగా ఎంట్రీ లభిస్తుంది. అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చినవారే ఫ్లాప్ లను తట్టుకుని నిలబడగలుగుతారు. ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేని హీరోలు ఎంతో కాలం వెయిట్ చేస్తేనే తప్ప ఒక క్రేజ్ అనేది రాదనే మాటలు ఇప్పటికీ వినిపిస్తుంటాయి. కానీ ఒక శ్రీకాంత్ .. రవితేజ .. నాని కెరియర్లను గమనిస్తే మనకి వినిపించే మాటల్లో నిజం లేదనిపిస్తుంది. టాలెంట్ ఉన్నవారిని ఎవరూ ఆపలేరనే విషయం అర్థమవుతుంది. అదే విషయాన్ని మరోమారు స్పష్టం చేసిన హీరోగా విజయ్ దేవరకొండ కనిపిస్తాడు.

తెలుగు తెరకి ఎంతోమంది కుర్రాళ్లు హీరోలుగా పరిచయమవుతుంటారు .. ఒక్కో సినిమాతో ఎదుగుతూ ఉంటారు. కానీ వాళ్లందరిలో విజయ్ దేవరకొండ తీరు భిన్నంగా కనిపిస్తుంది. ‘ఎవడే సుబ్రమణ్యం’ .. ‘పెళ్లిచూపులు’ సినిమాల్లో ఒక సాధారణమైన హీరోలా కనిపించిన విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో ఒక్కసారిగా విశ్వరూపం చూపించాడు. కోపం .. నిర్లక్ష్యం .. దూకుడు .. ఇలా ఆ పాత్రలోని అన్ని కోణాలను కవర్ చేస్తూ రఫ్ లుక్ తో ఆయన చూపిన నటన యూత్ కి బాగా కనెక్ట్ అయింది. విజయ్ దేవరకొండ డైలాగ్ డెలివరీ .. ఆయన బాడీ లాంగ్వేజ్ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచింది. ఈ సినిమాను ఇతర భాషల్లోకి రీమేక్ చేసినా వాళ్ల యాక్టింగ్ విజయ్ దేవరకొండ రేంజ్ లో లేదనే టాక్ రావడం ఆయన స్పెషాలిటీ.

ఒక పాత్రను ప్రేక్షకుల మనసులకు విజయ్ దేవరకొండ ఎంత దగ్గరగా తీసుకెళ్లగలడు అనే విషయానికి ‘గీత గోవిందం’ సినిమా ఒక ఉదాహరణ. సన్నివేశాల్లోను .. పాటల్లోను ఆయన ఎంతగా ఒదిగిపోతాడనేది ఈ సినిమా నిరూపించింది. ఇక ‘టాక్సీవాలా’ సినిమా కూడా అంతే ఆయన స్టైల్ కి తగ్గట్టుగా తెరకెక్కిన సినిమా. ఇలా తెరపై తన దూకుడు చూపిస్తున్న విజయ్ దేవరకొండకి రెండేళ్లుగా పరాజయాలు పలకరిస్తున్నాయి. ‘డియర్ కామ్రేడ్’ .. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ఈ రెండు సినిమాలు ఆయన ఇమేజ్ కి దగ్గరగా రూపొందించబడినవే అయితే కథాపరమైన బలహీనతలు .. లోపాలు అభిమానులను నిరాశ పరిచాయి.

ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ ‘ఫైటర్’ సినిమా చేస్తున్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాదిలో థియేటర్స్ కి రానుంది. గత పరాజయాల కారణంగా విజయ్ దేవరకొండ చాలా జాగ్రత్తలు తీసుకునే ఉంటాడులే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కానీ విజయ్ దేవరకొండ అలా అతి జాగ్రత్తలు తీసుకునే టైప్ కాదని అభిమానులు అంటున్నారు. “ఒక సినిమా ఫ్లాప్ అయితే పడిపోయే క్రేజ్ .. ఏం క్రేజురా బై” అన్నట్టుగానే ఆయన వ్యవహరిస్తుంటాడని చెబుతున్నారు. ఫ్లాప్ వచ్చింది కదా అని తన దూకుడు తగ్గించే ఆలోచన ఆయన చేయడు. ఎందుకంటే తనకి ఇంతటి ఫాలోయింగ్ రావడానికి కారణం ఆ దూకుడే అని ఆయనకి తెలుసు” అని అంటున్నారు. న్యూ ఇయర్లో విజయ్ దేవరకొండ దూకుడు ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి మరి.