Templates by BIGtheme NET
Home >> Telugu News >> నిత్యానంద కైలాస దేశానికి ఫ్రీ ఛార్టెడ్ ఫ్లయిట్..మూడు రోజులు అన్ని ఉచితమే

నిత్యానంద కైలాస దేశానికి ఫ్రీ ఛార్టెడ్ ఫ్లయిట్..మూడు రోజులు అన్ని ఉచితమే


నిత్యానంద .. ఈ పేరు తెలియనివారు అతి కొద్దిమంది మాత్రమే ఉంటారు. ఎందుకంటే అయన చేసిన పనులు అలాంటివి. స్వామిజీ ముసుగులో చాటుమాటు యవ్వారాలు నడిపి ఆ వ్యవహారం వెలుగులోకి రావడంతో రాత్రికి రాత్రే దేశం విడిచి పారిపోయి ఏకంగా ఒక దేశాన్నే ఏర్పాటు చేశాడు. ఇప్పుడు అక్కడికి వెళ్లడానికి విమాన సర్వీసులను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ విషయాన్ని నిత్యానంద స్వయంగా వెల్లడించారు. కైలాస పేరుతో తాను సృష్టించిన దేశాన్ని సందర్శించాలనుకునే తన భక్తుల కోసం కొత్తగా ఛార్టెడ్ ఫ్లయిట్ సర్వీసులను అందుబాటులోకి తీసుకుని వచ్చినట్లు నిత్యానంద వెల్లడించారు.

దీనికి సంబంధించిన ఓ వీడియో క్లిప్ను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆస్ట్రేలియా నుంచి తన కైలాస దేశానికి ఉచితంగా సందర్శకులను తీసుకెళ్తామని మూడు రోజుల పాటు మాత్రమే అక్కడ ఉండటానికి అనుమతి ఇస్తామని ఆ తర్వాత ఎవ్వరైనా తిరిగి వెనక్కి వెళ్లాల్సి ఉంటుందని షరతును విధించారు. అక్కడ ఉన్న మూడు రోజులూ ఉచిత ఆహారం నివాస వసతిని కల్పిస్తామని స్పష్టం చేశారు. ఆధ్యాత్మికతను అలవర్చడానికే ఈ విధంగా చేస్తునట్టు తెలిపారు.

ఇక తమ దేశ విసాల కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదని అధికారిక వెబ్ సైట్ లో విసా దరఖాస్తు కోసం ఇమెయిల పంపించితే సరిపోతుందని అన్నారు. సందర్శకులు పంపించిన ఇమెయిల్ ఆధారంగా వారికి తాము విసాను మంజూరు చేస్తామని తెలిపారు. కైలాస పాస్ పోర్ట్ జాతీయ పతాకాన్ని నిత్యానంద ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికోసం ప్రత్యేకంగా ఆయన kailaasa.org పేరుతో వెబ్ సైట్ ను ఏర్పాటు చేశారు. కైలాస దేశానికి సంబంధించిన పూర్తి వివరాలను అందులో పొందుపరిచారు. ఈక్వెడార్ సమీపంలో ఓ ద్వీపాన్ని కొనుగోలు చేసిన నిత్యానంద దానికి `కంట్రీ ఆఫ్ కైలాస`గా పేరు పెట్టారు. తన సొంత దేశంగా ప్రకటించుకున్నారు. ఈ భూమండలంపై ఉన్న అన్ని దేశాల్లో లభించని ఆధ్యాత్మిక గొప్పదనం ఆత్మ సంతృప్తి తన దేశంలో మాత్రమే లభిస్తుందని వెల్లడించారు.