గన్నవరం నుండి నూతన విమాన సర్వీసులు

0

గన్నవరం విమానాశ్రయం నుంచి డిసెంబర్‌లో తిరుపతి, విశాఖకు రెండు కొత్త సర్వీసులు ఆరంభం కానున్నాయి. ప్రస్తుతం ఈ రెండు నగరాలకు విజయవాడ నుంచి విమాన సర్వీసులు లేవు. ఇండిగో సంస్థ డిసెంబర్‌ ఒకటి నుంచి కొత్త సర్వీసులు ఆరంభిస్తోంది. తిరుపతిలో మధ్యాహ్నం 12.05కు ఆరంభమై విజయవాడకు ఒంటిగంటా ఇరవైకు చేరుతుంది. ఇదే విమాన సర్వీసు విజయవాడ నుంచి విశాఖకు వెళ్లి.. తిరిగి వస్తుంది. విజయవాడ నుంచి మళ్లీ తిరుపతికి సాయంత్రం బయలుదేరి వెళుతుంది. గన్నవరం విమానాశ్రయం నుంచి క్రమంగా దేశీయ విమానాల రాకపోకలు పెరుగుతున్నాయి.

2019 జనవరిలో రోజుకు 52 సర్వీసులు ఇక్కడి నుంచి నడిచేవి. తర్వాత క్రమంగా తగ్గి 40కు చేరాయి. కొవిడ్‌ నేపథ్యంలో పూర్తిగా అన్నీ ఆగిపోయాయి. తాజాగా ఒక్కొక్కటిగా ఆరంభమై.. ప్రస్తుతం రోజుకు 26 నడుస్తున్నాయి. గతంలో దేశంలోని తొమ్మిది నగరాలకు ఇక్కడి నుంచి సర్వీసులు నడిచేవి. ప్రస్తుతం దిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ నాలుగు నగరాలకు మాత్రమే నడుస్తున్నాయి. కడపకు వారానికి మూడు రోజులు సర్వీసులున్నాయి.

విమానయాన సంస్థల ఆసక్తి.. విజయవాడ నుంచి దేశంలోని అన్ని నగరాలకు ప్రయాణికుల రద్దీ ఉంటుంది. ప్రైవేటు విమానయాన సంస్థలు రద్దీగా ఉన్న రూట్లపై తాజాగా దృష్టిపెడుతున్నాయి. డిసెంబర్‌ నుంచి తిరుపతి, విశాఖకు రోజువారీ విమానాలను ఇండిగో సంస్థ ఆరంభిస్తోంది. ప్రస్తుతం నడుస్తున్న వాటిలో హైదరాబాద్‌, బెంగళూరు నగరాలకే రోజుకు ఐదు నుంచి ఆరు సర్వీసులున్నాయి. దిల్లీకి ఉదయం ఒకటి, రాత్రికి ఒకటి రెండే ఉన్నాయి. చెన్నైకు కేవలం ఒక్కటి మాత్రమే ఉంది. దిల్లీ, చెన్నై నగరాలకు ఇక్కడి నుంచి నడిపేందుకు మరికొన్ని విమానయాన సంస్థలు ముందుకొస్తున్నాయి. కొవిడ్‌ ప్రభావం తగ్గిన తర్వాత ఇక్కడి నుంచి సర్వీసులను ఆరంభించేందుకు ఇప్పటినుంచే కసరత్తు చేస్తున్నాయని.. విమానాశ్రయం అధికారులు వెల్లడించారు.
**ఇదే షెడ్యూల్‌..
*విజయవాడ-విశాఖ: మధ్యాహ్నం 1.45
*విజయవాడ- తిరుపతి: సాయంత్రం 4.50