Templates by BIGtheme NET
Home >> Telugu News >> జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో ట్విస్ట్.. ‘రావాలి జగన్.. కావాలి జగన్’

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో ట్విస్ట్.. ‘రావాలి జగన్.. కావాలి జగన్’


గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు డిసెంబర్ 1న జరగనున్న వేళ ప్రధాన పార్టీల ప్రచార హోరు ఇప్పటికే జోరందుకుంది. ఇక ఇవాల్టి నుంచి మంత్రి కేటీఆర్ కూడా రంగంలోకి దిగుతుండడంతో ఎన్నికల వాతావరణం మరింత వెడెక్కనుంది. మరో 10 రోజుల పాటు నగరంలో ఆరోపణలు, ప్రత్యారోపణలే వినిపించనున్నాయి. ఈ క్రమంలో టీఆర్ఎస్ చేస్తున్న ప్రచారంలో ఓ ఆసక్తికర ఘటన వెలుగు చూసింది.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పాల్గొనబోవడం లేదని ఇప్పటికే స్పష్టం చేసేసింది. అయితే, ప్రచార రథాలపై ‘రావాలి జగన్.. కావాలి జగన్’ అనే నినాదాలు కనిపిస్తుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నినాదం సుడిగాలిలా జనాల్లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే, ఆ నినాదం జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో కనిపించడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? గ్రేటర్‌లో ప్రచారంలో పాల్గొంటున్న టీఆర్ఎస్‌కు సంబంధించిన ప్రచార రథాలపై ‘రావాలి జగన్.. కావాలి జగన్’ అని ఉండడం విస్మయానికి గురి చేస్తోంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చిత్రం

దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ఏపీలో వైసీపీ వాడిన ప్రచార రథాలను గ్రేటర్ ఎన్నికల సందర్భంగా అద్దెకు తెచ్చుకున్నారని అంటున్నారు. ఆ రథాలకు గులాబీ రంగులేసి.. జగన్ స్టిక్కర్ తీయడం మర్చిపోయారని కామెంట్లు చేస్తున్నారు. నిజానికి ఎన్నికల సమయంలో ప్రచార రథాలను పార్టీలు అద్దెకు తీసుకునే సంగతి తెలిసిందే.

అసలు విషయం ఇదీ..
హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్ట డివిజన్ నుంచి టీఆర్ఎస్ తరపున కొలుకుల జగన్ అనే వ్యక్తి పోటీ చేస్తున్నాడు. అతని పేరు కూడా జగన్ కాబట్టి, తన ఎన్నికల ప్రచార రథంపై ఇప్పటికే ఎంతో పాపులరైన ‘రావాలి జగన్.. కావాలి జగన్’ అని రాయించుకున్నాడు. ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది.