‘అనగనగా ఓ అతిథి’ ట్రైలర్ టాక్

0

తెలుగులో కంటెంట్ ఓరియంటెడ్ వెబ్ సిరీస్ మరియు సరికొత్త సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ‘ఆహా’ లో మరో వైవిధ్యభరితమైన మూవీ రాబోతోంది. ‘Rx 100’ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ – చైతన్య కృష్ణ ప్రధాన ప్రధాన పాత్రలతో తెరకెక్కించిన పీరియాడిక్ థ్రిల్లర్ ”అనగనగా ఓ అతిథి”. కన్నడ దర్శకుడు దయాల్ పద్మనాభన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ట్రెండ్ లౌడ్ బ్యానర్ పై రాజా రామామూర్తి – చిందబర్ నటీశన్ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ మరియు టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ‘ఆహా’ ఓటీటీలో నవంబర్ 20న ఈ చిత్రం విడుదల అవుతున్న సందర్భంగా తాజాగా ‘అనగనగా ఓ అతిథి’ ట్రైలర్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

‘అనగనగా ఓ అతిథి’ ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. పేదరికంలో నివస్తున్న ఓ కుటుంబంలోకి అనుకోని ఓ అతిథి వచ్చిన తరువాత ఎదురయ్యే పరిస్థితుల నేపథ్యంలో ఈ థ్రిల్లర్ ఉంటుందని తెలుస్తోంది. కష్టాల నుంచి బయటపడటానికి ఇంటికి వచ్చిన అతిథిని హత మార్చాలని మల్లిక(పాయల్) కుటుంబం ప్లాన్స్ వేస్తున్నట్లు ట్రైలర్ లో చూపించారు. ‘కూరకి కోడిని నువ్వు కొయ్యి.. కూర తిన్నోన్ని..’ అంటూ పాయల్ చెప్పే డైలాగ్ ఆసక్తిని కలిగిస్తోంది. దురాశ – కామం – అత్యాశ వంటి వాటికి ఎమోషనల్ డ్రామాను కలిపి ఊహించని మలుపులతో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు అర్థం అవుతోంది. ఇందులో పాయల్ పల్లెటూరి అమ్మాయిగా కనిపించి తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. ఆమె డైలాగ్ డెలివరీ కూడా ఆకట్టుకునేలా ఉంది. రాకేష్ సినిమాటోగ్రఫీ.. మ్యూజిక్ డైరెక్టర్ అరోల్ కొరెల్లి నేపథ్య సంగీతం థ్రిల్ ని కలిగిస్తున్నాయి. ఈ చిత్రంలో ఆనంద్ చక్రపాణి – వీణ సుందర్ కీలక పాత్రల్లో నటించారు. ‘అనగనగా ఓ అతిథి’ చిత్రం నవంబర్ 20న ‘ఆహా’ డిజిటల్ వేదికపై విడుదల కాబోతుంది.