Templates by BIGtheme NET
Home >> Cinema News >> శివసేనలో చేరుతున్న ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్..!

శివసేనలో చేరుతున్న ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్..!


ప్రముఖ బాలీవుడ్ నటి మాజీ కాంగ్రెస్ నాయకురాలు ఊర్మిళా మంటోడ్కర్ నేడు(సోమవారం) శివసేన పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. 2019 పార్లమెంట్ ఎన్నికలలో ఊర్మిళ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉత్తర ముంబై స్థానం నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి గోపాల్ చినయ్య చేతిలో ఓటమి పాలైంది. ఒకప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన ‘రంగీలా’ బ్యూటీ ఊర్మిళ 2019 మార్చిలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకుంది. ఎన్నికల అనంతరం అదే ఏడాది సెప్టెంబర్ లో పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసింది. కాంగ్రెస్ లోని కొన్ని రాజకీయాల కారణంగానే తాను పార్టీకి దూరం అవుతున్నానని.. అక్కడ పెద్ద లక్ష్యం కోసం పనిచేయడానికి బదులు అంతర్గత రాజకీయాలు.. పార్టీలోని స్వార్థ ప్రయోజనాలతో పోరాటం చేయడం చాలా కష్టమంటూ ఊర్మిళ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ సమయంలో ముంబై కాంగ్రెస్ చీఫ్ మిలింద్ దేవరాతో తాను పంచుకున్న విశ్వసనీయ సమాచారం కూడా బయటకు రావడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు.. ముంబైలో తన ఓటమికి పార్టీలోని కొన్ని వర్గాలు పని చేశాయని తీవ్ర విమర్శలు చేసింది. కాంగ్రెస్ పై తనకు భ్రమలు తొలిగిపోయాయని ఊర్మిళ వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది.

ఇక అప్పటి నుంచి పాలిటిక్స్ కి దూరంగా ఉంటూ వస్తున్న ఈ బాలీవుడ్ భామ ఇవాళ శివసేన పార్టీలో చేరి మళ్ళీ తన రాజకీయ ప్రయాణం ప్రారంభించనుంది. శివసేన అధ్యక్షుడు ప్రస్తుత మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ఆధ్వర్యంలో పని చేయడానికి ఊర్మిళా నిర్ణయించుకుంది. ఆమెను మహారాష్ట్ర శానస మండలికి శివసేన నామినేట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే శివసేన ఊర్మిళ పేరును గవర్నర్ భగత్సింగ్ కొష్యారికి పంపారు. గవర్నర్ కు 12 మంది సభ్యులతో కూడిన జాబితాలో శివసేన నుంచి ఊర్మిళా మండోద్కర్ – చంద్రకాంత్ రఘువంషి – విజయ్ కరంజ్కర్ – నితిన్ బంగుడే పాటిల్ పేర్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఊర్మిళ శివసేన పార్టీలో చేరుతున్నట్లు తెలుస్తోంది.