మరో బుడ్డ సినిమా పట్టిన ఆహా

0

ప్రత్యేకంగా తెలుగు కంటెంట్ తో తెలుగు ప్రేక్షకుల కోసం అల్లు అరవింద్ ప్రారంభించిన ‘ఆహా’ ఓటీటీ ప్లాట్ ఫామ్ మెల్ల మెల్లగా కంటెంట్ విషయంలో జోరు పెంచుతోంది. అయితే భారీ సినిమాలు పెద్ద హీరోల సినిమాల వరకు మాత్రం ఇంకా వెళ్లడం లేదు. కంటెంట్ ఉన్న సినిమాలను కొనుగోలు చేసి స్ట్రీమింగ్ చేస్తోంది. ఇప్పటికే జోహార్.. బుచ్చినాయుడు కండ్రిగ.. నేను నా నేస్తం.. ట్రాన్స్.. ఫోరెన్సిక్ అనే సినిమాలు వచ్చాయి. చిన్న సినిమాలే అయినా అవి మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి. భారీ సినిమాలను కాకుండా చిన్న సినిమాలను కంటెంట్ ఉన్న సినిమాలను చూసి మరీ అల్లు అరవింద్ కొనుగోలు చేస్తున్నట్లుగా దీన్ని బట్టి అర్థం అవుతుంది.

తాజాగా మరో చిన్న సినిమాను ఆహా కోసం అల్లు వారు కొనుగోలు చేశారు. ప్రముఖ కమెడియన్ సుహాస్ హీరోగా ఛాందిని చౌదరి హీరోయిన్ గా సునీల్ కీలక పాత్రలో తెరకెక్కిన ‘కలర్ ఫొటో’ ఓటీటీ రైట్స్ ను ఆహా దక్కించుకుంది. ఈ సినిమాను హృదయ కాలేయం దర్శక నిర్మాత అయిన స్టీవెన్ శంకర్ అలియాస్ సాయి రాజేష్ నిర్మించాడు.

ఇటీవలే విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ దక్కింది. దాంతో సినిమాను ఆహా వారు కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాను దీపావళి సందర్బంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ఆహా ప్లాన్ చేస్తుందట. సందీప్ రాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఒక పల్లెటూరు ప్రేమను ప్రేక్షకుల ముందు ఉంచబోతుంది. అల్లు అరవింద్ నచ్చడంతో సినిమాపై అప్పుడే జనాల్లో ఆసక్తి మొదలైంది. త్వరలో స్ట్రీమింగ్ డేట్ ను ప్రకటించే అవకాశం ఉందంటున్నారు.