మహమ్మారీకి బలైన నరసాపురం నటుడు!

0

కరోనా మహమ్మారీ అంతకంతకు బెంబేలెత్తిస్తోంది. ముఖ్యంగా ఇది సెలబ్రిటీల్ని వెంటాడుతున్న తీరుపై టాలీవుడ్ కలవరపడుతోంది. ఇప్పటికే పలువురు ఆస్పత్రుల్లో చికిత్స పొంది క్షేమంగా తిరిగి ఇంటికి వచ్చినా కొందరు ఇంకా చికిత్స పొందుతున్నారు.

తాజాగా టాలీవుడ్ నటుడు కోసూరి వేణుగోపాల్ కరోనాతో మరణించారు. కరోనా పాజిటివ్ రావడంతో గత 20 రోజులుగా గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. బుధవారం రాత్రి ఆయన ఆరోగ్యం చికిత్సకు సహకరించలేదు. ఆయన కన్నుమూశారన్న వార్తతో టాలీవుడ్ లో విషాదం నెలకొంది.

కోసూరికి భార్య .. కొడుకు కూతురు ఉన్నారు. రాజమౌళి తెరకెక్కించిన మర్యాద రామన్న లో ఆయన పాత్రకు పేరొచ్చింది. పిల్ల జమీందార్ – ఛలో – విక్రమార్కుడు- అమీతుమీ వంటి విజయవంతమైన చిత్రాల్లో ఆయన పాత్రలు ఆకట్టుకున్నాయి. వీటితో పాటు ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి కమెడియన్ గానూ నవ్వించారు.

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురానికి చెందిన వేణుగోపాల్ ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాలో మేనేజర్ గా పని చేసి పదవీ విరమణ చేశారు. ఉద్యోగం చేస్తూనే సినిమాల్లో నటించారాయన. ఆయన మృతిపై మూవీ ఆర్టిస్టుల సంఘం సహా టీఎంటీఏయు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పరిశ్రమలో ఆయన సన్నిహితులు ఆవేదనను వ్యక్తం చేశారు.