మెగాస్టార్ ని మెప్పించలేకపోతున్నారా..?

0

మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ అభిమానులను ఖుషీ చేస్తున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్న చిరంజీవి.. తర్వాత చేయబోయే మూడు ప్రాజెక్ట్స్ పై క్లారిటీ వచ్చేసింది. డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘వేదలమ్’ తెలుగు రీమేక్ లో చిరు నటించనున్నాడు. అలానే మలయాళ సూపర్ హిట్ ‘లూసిఫర్’ రీమేక్ లో కూడా మెగాస్టార్ లైన్ లో పెట్టాడు. వీటితోపాటు బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో ఓ మూవీ చేయడానికి కమిట్ అయ్యాడు. అయితే దర్శకులనైతే లైన్ లో పెట్టాడు కానీ స్క్రిప్ట్స్ విషయంలో మాత్రం చిరు ని మెప్పించలేకపోతున్నారని ఫిలిం సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది.

‘లూసిఫర్’ రీమేక్ బాధ్యతలు ముందుగా యువ దర్శకుడు సుజీత్ చేతిలో పెట్టారు. అయితే సుజీత్ మార్పులు చేర్పులు చేసిన స్క్రిప్ట్ తో చిరంజీవిని మెప్పించలేకపోయాడని.. అందుకే ప్రాజెక్ట్ నుంచి తప్పించారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ కి స్క్రిప్ట్ బాధ్యతలు అప్పగించారు. అయితే వినాయక్ రెడీ చేసిన స్టోరీ కూడా నచ్చకపోవడంతో ఇప్పుడు తమిళ్ డైరెక్టర్ మోహన్ రాజా దగ్గరకు ఈ ప్రాజెక్ట్ చేరిందని టాక్ నడుస్తోంది. అలానే తాజాగా బాబీ కూడా మెగాస్టార్ ని మెప్పించలేకపోయాడని సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. గతేడాది వెంకటేష్ – నాగచైతన్య లతో ‘వెంకీమామ’ సినిమా తీసి సక్సెస్ అయిన బాబీ ని అదే తరహాలో భావోద్వేగాలతో కూడిన ఎంటర్టైనర్ ని సిద్ధం చేయమని చిరు కోరాడట. అయితే బాబీ చెప్పిన స్టోరీ చిరంజీవి ని మెప్పించలేకపోయిందట. మరి రాబోయే రోజుల్లో ఈ దర్శకులు తమ స్క్రిప్ట్ వర్క్ తో మెగాస్టార్ ని ఇంప్రెస్ చేస్తారేమో చూడాలి.