సామ్ డిజిటల్ డెబ్యూ మరింత ఆలస్యం కానుందా..?

0

అగ్ర కథానాయిక అక్కినేని సమంత ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ సిరీస్ తో వెబ్ వరల్డ్ లో అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’ కి కొనసాగింపుగా ఈ సీజన్ ని రూపొందించారు. ఇందులో సమంత నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించనుందని తెలుస్తోంది. ఆమె డీ గ్లామర్ లుక్ లో అందరిని షాక్ కి గురి చేస్తుందని టాక్. ఇప్పటికే విడుదలైన సమంత బ్యాక్ సైడ్ లుక్ లో ప్యాంటు షర్ట్ ధరించి డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో కనిపించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ సిరీస్ ని అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిసెంబర్ నెలలో విడుదల చేస్తారని అనుకున్నారు. అయితే ఈ సీజన్ మరింత ఆలస్యం కానుందని వార్తలు వస్తున్నాయి.

‘ఫ్యామిలీ మ్యాన్ 2’ సిరీస్ వీఎఫ్ఎక్స్ వర్క్ పూర్తవడానికి ఇంకా సమయం పడుతుందట. అందుకే డిసెంబర్ నెలలో రావడం కష్టమని అంటున్నారు. దీంతో ఈ సిరీస్ 2021 జనవరి చివర్లో లేదా ఫిబ్రవరి ప్రారంభంలో విడుదలయ్యే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. ఏదేమైనా ‘ఫ్యామిలీ మ్యాన్’ మంచి ఆదరణ దక్కించుకోవడంతో సీజన్ 2 పై మంచి అంచనాలు ఉన్నాయి. రాజ్ – కృష్ణ డీకే ఈ వెబ్ సిరీస్ ను రూపొందించారు. ఫస్ట్ సీజన్ లో నటించిన మనోజ్ బాయ్ పాయ్ – ప్రియమణి లు ఇందులో కూడా కొనసాగుతున్నారు. ఈ వెబ్ సిరీస్ తో సమంత పాన్ ఇండియా స్టార్ గా మారుతుందని నేషనల్ వైడ్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. సమంత సైతం ‘ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది.