మహేష్ బాబు – పవన్ కల్యాణ్ కెరీర్లో ప్లాప్ మూవీస్…!

0

టాలీవుడ్ స్టార్ హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇద్దరి సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ సాధిస్తుంటాయి. ఇప్పటి వరకు మహేష్ బాబు 26 సినిమాల్లో నటించగా పవన్ కళ్యాణ్ 25 చిత్రాల్లో నటించాడు. అయితే వాటిలో బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నట్లే ప్లాప్ మూవీస్ కూడా ఉన్నాయి. వీరి కెరీర్లో ఎన్నో అంచనాలతో వచ్చి ప్రేక్షకులను నిరాశపరిచిన సినిమాల లిస్ట్ చూద్దాం.

మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా పవన్ కల్యాణ్ 1996లో వచ్చిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ మూవీతో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. పవన్ నటించిన మొదటి రెండు సినిమాలు యావరేజ్ అనిపించుకున్నప్పటికీ ఆ తర్వాత వరుసగా ఐదు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ క్రమంలో వచ్చిన ‘జానీ’ సినిమా పవన్ కళ్యాణ్ మొదటి ప్లాప్ అని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ స్వయంగా దర్శకత్వం వహించి నిర్మించిన ఈ సినిమా తీవ్ర నిరాశ పరిచింది. ఆ తర్వాత వరుసగా నాలుగు ప్లాప్స్ చవి చూసాడు పవన్ కళ్యాణ్. ముందుగా వీర శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘గుడుంబా శంకర్’ సినిమా ఘోర పరాజయాన్ని చవి చూసింది. అయితే ఈ సినిమాలోని సాంగ్స్ మాత్రం సూపర్ హిట్ అయ్యాయి. ఇదే క్రమంలో పవన్ – ‘తొలిప్రేమ’ కరుణాకరన్ కాంబోలో వచ్చిన ‘బాలు’ ప్లాప్ సినిమాగా మిగిలిపోయింది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ‘బాలు’ అంచనాలు అందుకోలేక చతికిల పడింది. ఆ తర్వాత తమిళ్ డైరెక్టర్ ధరణి తో తీసిన ‘బంగారం’ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ప్లాప్ గా నిలిచింది. ఇక ‘సుస్వాగతం’ వంటి హిట్ చిత్రాన్ని అందించిన భీమినేని శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ‘అన్నవరం’ కూడా నిరాశపరిచింది. అయితే ‘జల్సా’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు.

అయితే హిట్ ట్రాక్ ఎక్కాడని ఆనందపడే లోపు హ్యాట్రిక్ ప్లాప్స్ పలకరించాయి. ‘ఖుషి’ డైరెక్టర్ ఎస్.జే సూర్య కాంబోలో వచ్చిన ‘కొమరం పులి’ డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఈ సినిమాని అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చిన ఏఆర్ రెహమాన్ కూడా కాపాడలేకపోయాడు. ఆ తర్వాత జయంత్ సి. పరాంజీ డైరెక్షన్ లో వచ్చిన ‘తీన్ మార్’.. విషువర్థన్ దర్శకత్వంలో పవన్ నటించిన ‘పంజా’ సినిమాలు కూడా పరాజయాలుగా నిలిచాయి. ఆ తర్వాత ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ పవన్ కెరీర్లో మరో సూపర్ ప్లాప్ అందుకుంది. పవన్ స్వయంగా రచించిన ఈ స్టోరీ ఫ్యాన్స్ ని సైతం మెప్పించలేకపోయింది. ఇక డాలీ – పవన్ కాంబోలో వచ్చిన ‘కాటమరాయుడు’ కూడా అంచనాలు అందుకోలేకపోయింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కెరీర్లో మైలురాయి వంటి 25వ సినిమాగా వచ్చిన ‘అజ్ఞాతవాసి’ సినిమా అతనికి అతి పెద్ద డిజాస్టర్ ని అందించింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాపై పలు వివాదాలు కూడా చెలరేగాయి. ఈ సినిమా తర్వాత రాజకీయాలపై ద్రుష్టి పెట్టిన పవన్.. మళ్ళీ ‘వకీల్ సాబ్’ తో రీ ఎంట్రీ ఇస్తున్నాడు.

సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా బాలనటుడిగా మెప్పించిన మహేష్.. 1999లో ‘రాజకుమారుడు’ సినిమాతో ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టాడు. ‘వంశీ’ సినిమాతో ఫస్ట్ ప్లాప్ అందుకున్నాడు మహేష్. బి.గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కృష్ణ మరియు నమ్రత శిరోద్కర్ కూడా నటించారు. ఈ సినిమా ప్లాప్ అయినా మహేష్ – నమ్రతల మధ్య ప్రేమ చిగురించడానికి కారణం అయింది. ఆ తర్వాత జయంత్ సి. పరాంజీ దర్శకత్వంలో వచ్చిన ‘టక్కరి దొంగ’ మహేష్ కి నంది అవార్డుని తెచ్చిపెట్టింది కానీ విజయాన్ని మాత్రం అందించలేకపోయింది. ఇక శోభన్ – మహేష్ కాంబోలో తెరకెక్కిన ‘బాబీ’ తీవ్ర నిరాశపరిచింది. తేజ దర్శకత్వంలో మహేష్ నటించిన ‘నిజం’ సినిమా మంచి కాన్సెప్ట్ తో తీశారని మెచ్చుకున్నప్పటికీ విజయం మాత్రం ఇవ్వలేదు.

ఇక ఎస్.జె సూర్య – మహేష్ కాంబోలో వచ్చిన ‘నాని’ కూడా ప్లాప్ ని మూటగట్టుకుంది. ఈ క్రమంలో ‘పోకిరి’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మహేష్.. హ్యాట్రిక్ ప్లాప్స్ అందుకున్నాడు. గుణశేఖర్ తో తీసిన ‘సైనికుడు’.. సురేందర్ రెడ్డితో ‘అతిథి’.. త్రివిక్రమ్ తో తీసిన ‘మహేష్ ఖలేజా’ సినిమాలు పరాజయాన్ని చవి చూశాయి. ఆ తర్వాత సుకుమార్ తో చేసిన ప్రయోగాత్మక చిత్రం ‘1 నేనొక్కడినే’ జనాలకు ఎక్కలేదు. ఇక శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేష్ నటించిన ‘బ్రహ్మోత్సవం’ డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఇదే క్రమంలో ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ‘స్పైడర్’ సినిమాను ప్రేక్షకులు తిరస్కరించారు. ప్రస్తుతం హ్యాట్రిక్ విజయాలతో జోష్ మీదున్న మహేష్.. పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తున్నాడు.