‘క్రాక్’ హిట్ శ్రుతి హాసన్ కి కలిసొచ్చినట్టే!

0

తెరపై శ్రుతి హాసన్ ను చూడగానే బ్రహ్మదేవుడు ఈ అమ్మాయిని పాలమీగడతో చేశాడేమోనని అనిపిస్తుంది. అంతటి నాజూకుతనం ఆమె సొంతం. కుదురైన రూపంలోనే అన్నీ ఏర్చి .. కూర్చి .. పేర్చినట్టుగా కనిపిస్తుంది. ఈ సుందరి గ్లామర్ కి గానీ .. నటనకి గాని వంకబెట్టవలసిన పనిలేదు. పైగా ఎక్కడా ఆమె కమల్ కూతురునని చెప్పుకుని అవకాశాలు సంపాదించకపోవడం ఆమె వ్యక్తిత్వానికి నిదర్శనంగా చెప్పుకోవాలి. తమిళ .. తెలుగు భాషల్లో వరుస ఫ్లాపులు ఉక్కిరిబిక్కిరి చేసినా దురదృష్టంపై ఆమె కలబడింది .. తట్టుకుని నిలబడింది.

వెలుగు ఉన్న చోటునే వెతుక్కోవాలి అన్నట్టుగా ఆమె ఎక్కడైతే ఐరన్ లెగ్ అనిపించుకుందో అక్కడే గోల్డెన్ లెగ్ అనిపించుకునేంతవరకూ వదల్లేదు. అంతటి పట్టుదలతో ఆమె అనుకున్నది సాధించింది. అంతేకాదు భారీ హిట్లు పడినప్పటికీ ఆమె తల ఎగరేసిన దాఖలాలు కనిపించవు .. లైట్ తీసుకుని తన పని తాను చేసుకునేది. అలాంటి శ్రుతి హాసన్ హిందీలోను తన సత్తా చాటడానికి గట్టి ప్రయత్నాలే చేసింది. ఈ క్రమంలోనే ఆమె తెలుగు .. తమిళ భాషల్లో దృష్టి పెట్టలేకపోయింది. అదే సమయంలో లవ్ ట్రాక్ లో పడిపోయి హిందీ సినిమాలకి కూడా దూరమైంది. అలా కెరియర్ పరంగా వెనుకబడిపోయింది.

తీరా నువు కనుతెరిచాక .. తీరం కనబడదే ఇంకా అన్నట్టుగా ఆమె చేతిలో ఒక్క సినిమా లేకుండా పోయింది. తమిళ .. తెలుగు భాషల్లో కొత్త హీరోయిన్ల జోరు పెరిగిపోయింది. దాంతో ఆమె తిరిగి మొదటి మెట్టు దగ్గర నుంచి తన ప్రయత్నాలు ప్రారంభించింది. అలా తెలుగులో ‘క్రాక్’ సినిమాలో ఛాన్స్ సంపాదించింది. రవితేజ – గోపీచంద్ మలినేని కాంబినేషన్లో గతంలో ‘బలుపు’ చేసిన ఆమె ఇప్పుడు ‘క్రాక్’ సినిమా చేసింది. ఈ సినిమా భారీ హిట్ ను సొంతం చేసుకోవడంతో శ్రుతి హాసన్ తేలికగా ఊపిరి పీల్చుకుంది. ఆమె రీ ఎంట్రీకి ఈ హిట్టు కలిసొచ్చింది. ఇక ఇప్పుడైనా ఆమె కాస్త నిలకడగా ఇక్కడ అవకాశాలని అందుకుంటూ గతంలో తాను వదిలేసి వెళ్లిన ప్లేస్ ను దక్కించుకుంటుందేమో చూడాలి.