పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆశలన్నీ ఆ సినిమాపైనే…!

0

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు ఓకే చేస్తున్న సంగతి తెలిసిందే. ముందుగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని బోనీకపూర్ సమర్పణలో దిల్ రాజు – శిరీష్ – హర్షిత్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఆ తర్వాత క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఓ పీరియాడికల్ మూవీలో నటించనున్నాడు. ఇప్పటికే ఒక షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాని మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కెరీర్లో 28వ చిత్రాన్ని హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. దీని తర్వాత స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమాకి కమిట్ అయ్యాడు పవన్.

కాగా పవర్ స్టార్ నటిస్తున్న ఈ నాలుగు చిత్రాల్లో పవన్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా హరీష్ శంకర్ తెరకెక్కించబోయే PSPK 28 అనే చెప్పాలి. ఎందుకంటే పవన్ ని డైరెక్ట్ చేస్తున్న వారిలో హరీష్ శంకర్ ఆల్రెడీ ఆయనకు బ్లాక్ బస్టర్ హిట్ అందించాడు. వరుస ప్లాప్స్ లో ఉన్న పవన్ కల్యాణ్ తో ‘గబ్బర్ సింగ్’ వంటి సూపర్ హిట్ సినిమా తీసి పవర్ స్టార్ ఫ్యాన్స్ కి నూతనోత్సాహాన్ని అందించాడు. అందుకే ఇప్పుడు ఈ సక్సెస్ఫుల్ కాంబోలో వస్తున్న రెండో సినిమాపై ఫ్యాన్స్ భారీ ఆశలే పెట్టుకున్నారు. ఇక మాస్ ఆడియన్స్ పల్స్ తెలిసిన హరీష్ సినిమా అంటే హీరో గెటప్ మరియు డైలాగ్స్ ప్రత్యేకంగా నిలుస్తాయనే విషయం తెలిసిందే. ఇప్పటికే హరీష్ శంకర్ విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్ విశేషంగా ఆకట్టుకుంది.

ఈ క్రమంలో పవన్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న మరో సినిమా క్రిష్ జాగర్లమూడి తో తీస్తున్న PSPK 27 అని చెప్పాలి. పవన్ కెరీర్లో ఫస్ట్ టైం ఒక పీరియాడికల్ జోనర్ లో సినిమా చేస్తుండటంతో ఫ్యాన్స్ అంచనాలు పెట్టుకున్నారు. కాకపోతే క్రిష్ గత చిత్రాలు కాస్త నిరాశ పరచడంతో కొంచెం ఆందోళన కూడా పడుతున్నారు. వీటి తర్వాత ‘కిక్’ ‘రేసుగుర్రం’ ‘ధ్రువ’ వంటి విజయవంతమైన చిత్రాలను అందించిన సురేందర్ రెడ్డి సినిమా ఉంది. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా హీరోని గత చిత్రాల్లో చూడనంత కొత్తగా స్టైలిష్ గా చూపిస్తాడనే పేరుంది. అందుకే పవన్ ని కూడా డిఫెరెంట్ గా ప్రెజెంట్ చేస్తారని అనుకుంటున్నారు. ఇక ‘వకీల్ సాబ్’ సినిమా ఎలాగూ తెలిసిన స్టోరీయే కాబట్టి దీనిపై పవన్ అభిమానులకు అంచనాలు పెద్దగా లేవనే చెప్పవచ్చు. కానీ మూడేళ్ళ తర్వాత పవర్ స్టార్ స్క్రీన్ మీద ఎలా కనిపిస్తాడో అని ఉత్సహంగా ఎదురుచూస్తున్నారు.